జావా బైక్ ప్రియులకు శుభవార్త
జావా మోటార్ సైకిల్స్ గత ఏడాది నవంబరులో జావా మరియు జావా ఫార్టీ-టూ అనే రెండు బైకులను విడుదల చేసింది. విడుదలైన అనతి కాలంలోనే రెండు మోడళ్లకు ఊహించని విధంగా భారీ డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు బుకింగ్స్ మరియు టెస్ట్ రైడ్ వరకు మాత్రమే పరిమితమైన జావా సంస్థ ఇప్పుడు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు అతి త్వరలో డెలివరీ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
జావా మోటార్ సైకిల్స్ తమ "జావా" మరియు "జావా 42" బైకులను ఇది వరకే బుక్ చేసుకున్న కస్టమర్లకు మార్చి నాలుగో వారంలో డెలివరీ ఇవ్వనున్నట్లు మరియు తొలి ఏడాదిలో ప్రతి నెలా 7,000 యూనిట్ల విక్రయాలను ఆశిస్తున్నట్లు, క్లాసిక్ లెజెండ్స్ సంస్థ ఫౌండర్ అనుమ్ థరేజా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జావా మరియు జావా42 బైకులు విడుదలైనప్పుడే ఆన్‌లైన్ వేదికగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2018 చివరి నాటికి బుకింగ్స్ క్లోజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎంత మంది జావా బైకులను బుక్ చేసుకున్నారనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.
జావా మోటార్ సైకిల్స్ విక్రయిస్తున్న జావా బైకు ధర రూ. 1.69 లక్షలు మరియు జావా 42 బైకు ధర రూ. 1.55 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి. రెండు మోడళ్లు కూడా పాత కాలం నాటి రెట్రో స్టైల్, అతి తక్కువ డిజైన్ ఎలిమెంట్లతో ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిలో 293సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 27బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.