సంచలనాత్మక ధరతో టాటా హ్యారీయర్ విడుదల చేసిన టాటా మోటార్స్
టాటా హ్యారీయర్(Tata Harrier) విడుదల: దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త టాటా హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసింది. అధునాతన డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజన్ మరియు అత్యంత సరసమైన ధరలో టాటా తమ హ్యారియర్ వాహనాన్ని విపణిలోకి ప్రవేశపెట్టింది.
టాటా హ్యారియర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 12.69 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించారు. టాటా హ్యారియర్ ఎస్‌యూవీ లభించే వేరియంట్లు, వేరియంట్ల వారీగా ధరలు, డిజైన్, ఇంజన్, ఫీచర్లు, మైలేజ్ మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి....
టాటా హ్యారియర్ వేరియంట్లు:
టాటా హ్యారియర్ ఎస్‌యూవీ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, ఎక్స్ఇ, ఎక్స్ఎమ్, ఎక్స్‌టి మరియు ఎక్స్‌జడ్
- XE ధర రూ. 12.69 లక్షలు
- XM ధర రూ. 13.75 లక్షలు
- XT ధర రూ. 14.95 లక్షలు
- XZ ధర రూ. 16.25 లక్షలు
గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.
టాటా హ్యారియర్ డిజైన్ మరియు డెవలప్‌మెంట్
దిగ్గజ లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను టాటా గ్రూప్ సొంతం చేసుకున్న తరువాత ల్యాండ్ రోవర్ మరియు జాగ్వార్ సంస్థలలో ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టాటా తమ తదుపరి ఉత్పత్తులలో విరివిగా ఉపయోగించడం ప్రారంభించింది. ఇందుకు టాటా హ్యారియర్ ఓ ఉదాహరణ. అవును, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీని నిర్మించిన ల్యాండ్ రోవర్ డి8 ఆర్కిటెక్చర్ ఆధారంగా టాటా హ్యారియర్ ఎస్‌యూని నిర్మించింది. హ్యారియర్ నిర్మాణం మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ పరిశీలిస్తే ఈ విషయాన్ని గమనించవచ్చు.
ఫ్రంట్ డిజైన్‌లో పదునైన ఎల్ఈడీ లైట్లు, ఫాగ్ ల్యాంప్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, విశాలమైన బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఎత్తైన బానెట్ వంటివి ఎస్‌యూవీకి ఓ సరికొత్త రూపాన్ని తీసుకొచ్చాయి. ఫ్రంట్ డిజైన్ మధ్యలో టాటా క్రోమ్ లోగో హుందాగా ఒదిగిపోయింది.
అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఎలాంటి రహదారులనైనా సునాయసంగా చేధిస్తుంది. ఇసుక, బురద, మంచు, రాళ్లతో నిండిన ఎన్నో ఆఫ్-రోడ్లలో అత్యంత సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది.
టాటా హ్యారియర్ ఇంజన్, గేర్‌బాక్స్, పవర్ మరియు మైలేజ్
టాటా హ్యారియర్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన 2.0-లీటర్ కైరోటెక్ డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ ప్రకారం టాటా హ్యారియర్ లీటరుకు 16.27 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అమెరికన్ సంస్థ జీప్ విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.
టాటా హ్యారియర్ ఫీచర్లు
- అడ్జెస్ట్ చేసుకునే స్టీరింగ్ వీల్,
- 4-ఇంచ్ మల్టీ-ఇన్ఫర్మేషన్-డిస్ల్పే
- 7 లేదా 8.8 అంగుళాల టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- స్టీరింగ్ నుండి కంట్రోల్ చేయగల ఆడియో మరియు మల్టీ డ్రైవ్ మోడ్స్
- 6 లేదా 8 దిశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు
- ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్, రియర్ మిర్రర్ కోసం వాష్ వైప్ ఫంక్షన్
- ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి కనెక్టివిటి ఫీచర్లు
- పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా, రియర్ డీఫాగర్, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- 9 స్పీకర్ల జెబిఎల్ సౌండ్ సిస్టమ్ మరియు సబ్-ఊఫర్లు ఉన్నాయి
టాటా హ్యారియర్ సేఫ్టీ ఫీచర్లు
భద్రత పరంగా టాటా హ్యారియర్ ఎస్‌యూవీలో 4-ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
టాటా హ్యారియర్‌కు పోటీ
అత్యంత సరసమైన ధరలో సరికొత్త డిజైన్, నమ్మశక్యంగాని ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్, ఎంచుకోదగిన విభిన్న వేరియంట్లు ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన టాటా హ్యారియర్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న ఇతర ప్రీమియం ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500, జీప్ కంపాస్, నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ వంటి పలు ఎస్‌యూవీలకు బలమైన పోటీనివ్వనుంది.
టాటా హ్యారియర్ బుకింగ్స్ మరియు వెయిటింగ్ పీరియడ్
టాటా హ్యారియర్ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా విక్రయ కేంద్రాలలో రూ. 30,000 చెల్లించి మీ హ్యారియర్ ఎస్‌యూవీ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టాటా హ్యారియర్ మీద మూడు నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే ఇప్పుడు బుకింగ్ చేసుకుంటే మూడు నెలల తరువాత డెలివరీ ఇస్తారు.
టాటా హ్యారియర్ విడుదల గురించి మా ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి... ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి...