టయోటా షోరూముల్లో మారుతి వితారా బ్రిజా
జపాన్‌కు చెందిన టయోటా మరియు సుజుకి ఇటీవల భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఇరు సంస్థల తమ కార్లను సంయుక్తంగా విక్రయించడం మరియు కొత్త కార్ల అభివృద్ది-తయారీకి సంభందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోనున్నాయి. సుజుకి మరియు టయోటా సంస్థలు భాగస్వామ్యం ఇండియాలో యథావిధిగా కొనసాగనుంది. ఇక మీదట టయోటా షోరూముల్లో మారుతి కార్లు, మారుతి సుజుకి విక్రయ కేంద్రాల్లో టయోటా కంపెనీకి చెందిన కార్లు అందుబాటులోకి వస్తాయి. అంటే, ఇరు కంపెనీలు కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్న కార్లను రీ-బ్యాడ్జితో(కొత్త పేర్లతో) విక్రయించనున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, టయోటా ఇండియా విభాగం 2020-21 మధ్య కాలంలో మారుతి సుజుకి ప్రస్తుతం విక్రయిస్తున్న వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త పేరుతో టయోటా సంస్థ తమ షోరూముల్లో విక్రయించనుంది. వితారా బ్రిజా తరువాత బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
టయోటా ఇండియా లైనప్‌లో ఉన్న పాపులర్ సెడాన్ కరోలా ఆల్టీస్ కారును మారుతి సుజుకి సరికొత్త పేరుతో దేశీయంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మారుతి సుజుకి మరియు టయోటా మోటార్స్ తమ కార్లను పేర్లు మార్చుకొని విక్రయిస్తాయి. కానీ డిజైన్, టెక్నాలజీ, మరియు సాంకేతికంగా ఎలాంటి మార్పులు ఉండబోవు.