Dhanteras: ‘ధంతేరాస్’పైనే నగల వ్యాపారుల ఆశలు.. గత ఏడాది వ్యాపారంలో 70% జరుగుతుందని అంచనా
కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమణం వైపు వెళ్లింది. అయితే, పండుగ సీజన్లో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుండటంతో వస్తువులకు డిమాండ్ పెరిగి మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా నెలకొన్నాయి. ఇదే ధోరణి కొనసాగితే ఈ 'ధంతేరాస్ సమయంలో అమ్మకాలు పెరగవచ్చని ఆశాబావం వ్యక్తం చేస్తున్నారు ఆభరణాలు వ్యాపారులు. అయితే, గత సంవత్సరం ధంతేరాస్ సమయంలో జరిగిన వ్యాపారంలో ఈ సారి కనీసం 70 శాతం వరకు అయినా నగల వ్యాపారం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేఎఫ్) ఛైర్మన్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారితో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి.
ఇదే ధోరణి కొనసాగితే బంగారం కొనుగొళ్లు ఎక్కువగా ఉంటే ధంతేరాస్ సమయంలో క్రిందటి ఏడాది నమోదు చేసిన వ్యాపారంలో కనీసం 70 శాతం వ్యాపారం అయినా చేయగలమని ఆశాభావంతో ఉన్నాం.’’ అని అన్నారు. కాగా, భారతదేశంలో జరుపుకునే అత్యంత ప్రాధాన్యత గల పండుగల్లో దీపావళి ఒకటి. ఈ సీజన్లోనే వచ్చే ‘ధంతేరాస్’ పర్వదినాన బంగారం కొనుగోలు చేస్తే తమ కుటుంబంపై లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందని, సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చినట్లేనని భారతీయులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఏటా ధంతేరాస్ రోజున బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, ఆ రోజు నగల దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయన్న విషయం తెలిసిందే.
మార్కెట్ పరిస్థితులు పుంజుకుంటున్నాయి..
ధంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం మాట్లాడుతూ ‘‘ఈ ధంతేరాస్ శుభ సమయంలో బంగారం కొనుగోలు చేయడం వల్ల అదృష్టం, సంపదలు పెరుగుతాయని లక్షలాది మంది భారతీయులు విశ్వసిస్తారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడంతో క్రితం ఏడాదితో పోలిస్తే కొంత మేర డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. కానీ, ధంతేరాస్ సెంటిమెంట్ను ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది కూడా కొనుగోళ్లు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నాం. లాక్డౌన్ ఫలితంగా చాలా మంది తమ ఖర్చును తగ్గించుకుంటుండటంతో తమ నగదును బంగారంలో పెట్టుబడికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.’’ అని ఆయన అన్నారు.
కాగా, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలలో నగల వ్యాపారం 107 శాతం నెలవారీ లాభాన్ని చూసింది. అందువల్ల, బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అయితే, మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే బంగారం కొనే ఛాన్స్ ఇస్తున్నాయి సేఫ్ గోల్డ్, ఆగ్మాంట్, MMTC–PAMP వంటి డిజిటల్ గోల్డ్ ప్రొవైడర్స్. దీనిపై పిఎన్‌జి జ్యువెలర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ కోవిడ్ -–19 కారణంగా ఏర్పడిన అనిశ్చితి సమయంలో ప్రారంభంలో పడిపోయిన బంగారం కొనుగొళ్లు, ప్రస్తుత పండుగ సీజన్తో పాటు, వివాహాల సీజన్ కావడంతో మార్కెట్ పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అంతేకాక, వ్యవసాయ- ఆధారిత గ్రామీణ కుటుంబాలు సైతం ఈ మధ్య కాలంలో బంగారంపై ఎక్కువ ఖర్చు చేసే స్పష్టమైన ధోరణిని మేము చూస్తున్నాము. ఇది బంగారం కొనుగోళ్లు పెరగడానికి ఆశాజనకమైన పరిణామాలకు కారణమని చెప్పవచ్చు.”అని ఆయన అన్నారు.