Whatsapp Payment: వాట్సప్ పేమెంట్స్ కేంద్రం అనుమతి...ఇక వాట్సాప్ లో డబ్బులు పంపొచ్చు

Sunday, December 6, 2020 04:30 PM Business
Whatsapp Payment: వాట్సప్ పేమెంట్స్ కేంద్రం అనుమతి...ఇక వాట్సాప్ లో డబ్బులు పంపొచ్చు

వాట్సాప్.. భారత్ లోని కోట్లాది మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో ఎలా మమేకపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వాట్సాప్ చూడకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సామాజిక మాధ్యమం అందరితో అంతగా పెనవేసుకుపోయింది. ఇప్పటివరకు కేవలం సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడానికి మాత్రమే పరిమితిమైన ఈ యాప్.. తాజాగా మరో కీలక ముందడుగు వేసింది. ఇకపై వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించడం, చెల్లింపులు జరపడం కూడా చేసుకోవచ్చు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దశలవారీగా ఈ సేవలను ప్రారంభించుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వాట్సాప్ పే ద్వారా చెల్లింపులకు భారత ప్రభుత్వం అనుమతించడంతో ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ హర్షం వ్యక్తంచేశారు.

శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. వాట్సాప్ ద్వారా డబ్బు పంపించడం.. సందేశాలు పంపించినంత సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాట్సాప్ చెల్లింపులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమన్నారు. 160కి బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. ఈ చెల్లింపులకు మరింత భద్రత తీసుకొచ్చేందుకు త్వరలోనే వాట్సాప్ యూపీఐ తీసుకొస్తామని జుకర్ బర్గ్ వెల్లడించారు. వాట్సాప్ ప్రస్తుతం భారత్ లో ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాతోపాటు జియో పేమెంట్స్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదర్చుకుంది. వాట్సాప్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తప్పనిసరి. వాట్సాప్ పేమెంట్ సేవలు అన్ని ఐఓఓస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ మీ వాట్సాప్ కనిపించాలంటే వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలని సంస్థ సూచించింది.
 

For All Tech Queries Please Click Here..!