ఆస్పత్రి బాత్రూమ్‌లో కరోనా సోకిన మహిళా ఆత్మహత్య
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు అందరినీ భయపెడుతున్నాయి. 21 రోజులకి పైగా దేశమంతా లాక్‌డౌన్‌లో కొనసాగుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు కూడా తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటువంటి ఘటన తాజాగా మహారాష్ట్రలోని ముంబయి లో జరిగింది. ముంబయికి చెందిన మహిళా రోగి హాస్పిటల్ బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ముంబయికి చెందిన మహిళ(29) కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆమెను నగరంలోని బివైఎల్ నాయర్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లింది. ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా కిటికీకి చున్నీతో ఉరేసుకుని కనిపించింది. డాక్టర్లు ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు తేలింది. కరోనాతో బాధపడుతున్న ఆ మహిళ కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉంటోందని ఆ వార్డులో సేవలందించే సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.