ఆరోగ్యకరమైన దంతాల కోసం...
దంతాలు సురక్షితంగా లేకపోతే చాలా చిరాకుగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో దంత సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దంతాల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వర్తమానంలో దంత సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. మారుతున్న జీవన శైలిలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో ఈ మార్పులు వచ్చేశాయి.
పిజ్జా, బర్గర్లు, ఫాస్ట్‌ఫుడ్స్ ఇంకా రకరకాల ఆహార పదార్థాలకు నగరవాసులు అలవాటు పడిపోయారు. ఇలాంటి ఆహారపుటలవాట్ల వలన ముఖ్యంగా దంతాల పనితనం పంటి ఎనామిల్‌ని పాడుచేసి, దాని పటుత్వాన్ని పోగొడుతుంది. దీంతో క్రమంగా దంతాలు చెడిపోవడం, తర్వాత ఊడిపోవడం వంటి జరుగుతుంది. అతి చిన్న వయస్సులోనే ప్రత్యేకించి పట్టణవాసుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దంత సిరి దర్జాగా ఉండాలంటే... కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే చాలు. ఇవి దంతాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవేంటో తెలుసుకుందాం రండి...
- ఉల్లిపాయలు: ఇవి అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా బ్యాక్టీరియాని పోగొట్టి నోటిని, శరీరాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. కాబట్టి దీనిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది.
- నువ్వులు: చూడటానికి సన్నగా కనిపించే ఈ చిన్న గింజలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.
- కూర: భారతీయ ఆహారంలో ఇది తప్పనిసరి అయినప్పటికీ, కూరలు మసాలాతో ఉండడం వల్ల, అందులోని దినుసులు ఆమ్లాన్ని ఎక్కువగా తయారుచేస్తాయి. దాన్ని తిన్న తరువాత తప్పనిసరిగా నోటిని శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే దంతాల పటుత్వం తగ్గిపోతుంది.
ఇలాంటి జాగ్రత్తలతో కొంత వరకూ దంత సంరక్షణ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.