పంచాయతీలకు ఊరట, 14వ ఆర్థిక సంఘం నిధులకు గ్రీన్‌సిగ్నల్‌

Thursday, March 26, 2020 02:22 PM News
పంచాయతీలకు ఊరట, 14వ ఆర్థిక సంఘం నిధులకు గ్రీన్‌సిగ్నల్‌

నిధుల్లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2018 నుంచి పెండింగ్‌లో ఉండిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఒక విడత, 2019–20 సంవత్సరానికి సంబంధించి రెండు విడతలు కలిపి మొత్తం మూడు విడతలుగా రావాల్సి ఉండగా 2018–19 సంవత్సరానికి  సంబంధించిన ఒక విడత నిధులు రూ.72,25,71,000 విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి రామనాథరెడ్డి తెలిపారు. గత టీడీపీ సర్కార్‌ స్థానిక సంస్థలను పూర్తిగా నిరీ్వర్యం చేసింది.

పంచాయతీల నిధులను సైతం దారి మళ్లించగా.. గ్రామాల్లో రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి పడకేసింది. పంచాయతీల ఖజానాల్లో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులే రూ.లక్షలు చేతినుంచి ఖర్చు చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు మంజూరు కావడంతో పంచాయతీలకు ఊరట వచ్చింది.

జిల్లాలో మొత్తం 1,003 (ప్రస్తుతం 1,044) పంచాయతీలకు గాను జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటు చేయనున్నారు. కాగా ఈ మొత్తం నిధులన్నీ తాగునీటి, పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో 13,386 చేతిపంపులుండగా..చేతిపంపుల నిర్వహణకు రూ. 1.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో చేతిపంపు నిర్వహణకు రూ.వెయ్యి కేటాయించారు. ఇక రక్షిత తాగునీటి అవసరాలకు రూ.42.27 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జిల్లా పరిషత్‌ ద్వారా ఖర్చు చేయనున్నారు. అంటే ఈ నిధులను పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌కు మళ్లించనున్నారు. తక్కిన  నిధులను పంచాయతీలకు కేటాయించనున్నారు.   

For All Tech Queries Please Click Here..!
Topics: