భారత్‌లో ఒక్కరోజే 39 వేల కరోనా కేసులు.
ప్రాణాంతక కరోనా వైరస్ భూగోళాన్ని కమ్మేసింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత బలపడుతోందే తప్ప.. దాని ప్రభావం తగ్గట్లేదు. కనీసం బలహీనపడుతున్న సూచనలు కూడా లేవు. గంటగంటకూ వేలాది మందిని బలి తీసుకుంటోందా వైరస్. భారత్ సహా ప్రపంచ దేశాలను కబళించేలా కనిపిస్తోంది. వ్యాక్సిన్ తప్ప మరెలాంటి ముందుజాగ్రత్త చర్యలకూ ఈ మహమ్మారి లొంగేలా కనిపించట్లేదు.
భారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను సడలించిన తరువాత.. రోజువారీగా నమోదవుతోన్న కేసులు రికార్డులను బదల్లు కొడుతున్నాయి. రోజురోజుకూ వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ఒక్కరోజే దేశంలో 38,902కు పైగా కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో చేయి జారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.