భారతదేశం లో ప్రతీ లక్షకు ఎన్ని కరోనా కేసులో తెలుసా..!
భారతదేశంలో ఇప్పటివరకు ప్రతి లక్ష జనాభాకు 7.1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 60 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకు 49,15,420 కరోనా కేసులు బయటపడ్డాయి. ప్రతి లక్ష మందికి అమెరికాలో 431 కేసులు ఉండగా, రష్యాలో 195, యూకేలో 361, స్పెయిన్‌లో 494, ఇటలీలో 372, బ్రెజిల్‌లో 104, జర్మనీలో 210, టర్కీలో 180, ఫ్రాన్స్‌లో 209, ఇరాన్‌లో 145 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు వచ్చాయని వివరించింది. అయితే భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. మరణాలు 3 వేల మార్కును దాటేశాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కేవలం 24 గంటల్లో 5,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే తాజాగా 157 మంది కరోనా వల్ల మృతి చెందారు.