తెలంగాణలో గాంధీ ఆస్పత్రి హెల్త్ వర్కర్ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్
Hyderabad, Jan 16: దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేటి నుంచి మొదలయింది. కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌లోని శానిటైజర్ కార్మికుడు మనీష్ కుమార్‌కు వేయగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ టీకా ప్రక్రియ (Covid Vaccination in Telangana) ఆరంభమైంది.
అయితే తొలి టీకాను తానే వేసుకుంటానని ప్రకటించిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ (Etela rajender) కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో వెనక్కి తగ్గారు. కరోనా తొలి టీకాను పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్‌కు మాత్రమే ఇవ్వాలని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు.
మంత్రులకు, ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ నాయకులు తొలి విడతలోనే టీకా వేయించుకుంటే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు అభిప్రాయపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన ఈటల.. తొలి వ్యాక్సిన్ (COVID-19 Vaccination) వేసుకునేందుకు నిరాకరించారు. అయితే కోవిడ్ నియంత్రణకు రూపొందించిన టీకాపై ప్రజల్లో ఆందోళనలు తొలగించేందుకు తాను వ్యాక్సిన్ వేసుకుంటానని చెప్పినట్లు వివరించారు. వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలను తొలగించేందుకే అలా అన్నట్లు ఆయన చెప్పారు.
గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. ప్రారంభంలో ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకాలు వేస్తామన్నారు. వైద్యారోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. తొలివిడతలో పారిశుద్ధ్య సిబ్బందికి టీకా ఇవ్వాలని ప్రధాని చెప్పారు. వ్యాక్సిన్ కోసం ఎవరూ తొందర పడొద్దు అని సూచించారు. ప్రాధాన్యక్రమంలో అందరికీ కొవిడ్ టీకాలు ఇస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.