నేడే వ్యాక్సినేషన్ డ్రైవ్, వారికి వ్యాక్సిన్ ఇవ్వొద్దని తెలిపిన కేంద్రం
New Delhi, Jan 16: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కోవిడ్ వ్యాక్సినేషన్ (Coronavirus Vaccination) కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారిని కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్ (Mega Covid-19 vaccination) కార్యక్రమానికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులైన ఆరోగ్య కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడతారు.
వ్యాక్సినేషన్ కోసం కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల టీకా డోసులను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(PMO) తెలిపింది. ప్రజాభాగస్వామ్యంలో భాగంగా ప్రభుత్వం చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పీఎంవో పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3,006 సెషన్ సైట్లను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసినట్లు పీఎంవో తెలిపింది. మొదటి రోజు ప్రతి సెషన్ సైట్‌లో కనీసం 100 మందికి టీకా ఇస్తారని పేర్కొంది.
మొదటి రోజు టీకా తీసుకునే కొందరు ఆరోగ్య కార్యకర్తలతో ప్రధాని మోదీ (PM Narendra Modi) సంభాషించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈ జాబితాలో ఉన్న ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రుల అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం శాఖకు చెందిన నిర్మాణ్ భవన్‌లోని కోవిడ్ కంట్రోల్ రూంను సందర్శించారు. వ్యాక్సినేషన్ డోసుల కేటాయింపుల్లో ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రశ్నే లేదు. ఇది ముందుగా సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ డోసులు, రానున్న వారాల్లో డోసుల సరఫరా కొనసాగిస్తాం. టీకా సరఫరాలో లోటు జరుగుతుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇదిలా ఉంటే 16న జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో పోలియో టీకా కార్యక్రమం పల్స్ పోలియో జనవరి 31వ తేదీకి వాయిదా పడిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయం అధికారులతో సంప్రదింపుల అనంతరం పల్స్ పోలియోను రీ షెడ్యూల్ చేసినట్లు వివరించింది. కాగా గర్భవతులు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వకూడదో చెబుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
కేవలం 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్ ప్రయోగాలు జరగనందున వారికి వ్యాక్సిన్ ఇవ్వవద్దని స్పష్టం చేసింది. మొదటగా ఇచ్చిన డోసుకు సంబంధించిన వ్యాక్సిన్‌నే 14 రోజుల వ్యవధితో ఇచ్చే రెండో డోసులోనూ ఇవ్వాలని స్పష్టం చేసింది.