సంక్రాంతికి, సూర్యుడికి సంబంధం ఏమిటో తెలుసుకుందామా..
మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
సంక్రాంతి లేదా సంక్రమణము- అంటే "మారడం" అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు.
సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. ఉత్తర భారతంలో నివసించే హిందువులు, సిక్కులు సంక్రాంతి పండగను మాఘీ అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు. గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మకరసంక్రాంతిగా పిలుస్తారు. మధ్యభారత దేశంలో సుకరాత్ అని అస్సాంలో మఘ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. గుజరాత్‌లో గాలి పటాలను ఎగురవేస్తారు.
సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయాని విశ్వసిస్తారు. ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది. బెల్లం, లడ్డూలను తయారు చేసి ఇరుగుపొరుగువారికి పంచుతారు. విబేధాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని, సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది. హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళతారని చెబుతారు.
నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా
బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.
సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి
1. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
2. కలకలలాడే ముంగిట రంగవల్లులు, బసవన్న పాటలు
మనకే స్వంతమయిన ఆచారాలు
మీకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
3. తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ..
మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ..
పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ..
సంక్రాంతి పండుగను జరుపుకోండి...
తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి..
అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
4. ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో..
వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో..
మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో..
మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో..
ఆనంద నిలయంగా మారి..
మీ ఇంటిల్లి పాది అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
5. మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని..
సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని..
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని..
కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..
6. అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి..
సరదాలు తెచ్చే సంక్రాంతి..
ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా..
మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
7. పాలలోని తెల్లదనం, చెరుకులోని తియ్యదనం,
ముంగిట్లో ముగ్గులోని రంగుల అందం.
ఈ అన్నింటి కలయికతో పండగ నాడు కలిపి మీ ఇంట్లో వెల్లివిరియాలి ఆనందం.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
8. తెలుగుదనానికి నిలువెత్తు ప్రతీక.
ఆ గాలిపటంలా ఉన్నతంగా ఎగిరే మన ఘనత.
జీవితాన్ని రంగులమయం చేసే అచ్చమైన వేడుక మన సంక్రాతి పండుగ.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
9. నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు,
మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు. పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
10 ఆకుపచ్చని మామిడి తోరణాలు,
పసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలు.
ముంగిట్లో ముగ్గులు, అందమైన గొబ్బెమ్మలు. ఇంటికి తరలివచ్చే ధాన్యరాశులు.
ఇదే కదా మన తెలుగింటి సంస్కృతి,
ఇదే కదా మన తెలుగింటి పండగ. సంక్రాంతి శుభాకాంక్షలు!
11. భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం..
కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం..
పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం..
సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో
ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
12. తరిగిపోని ధాన్యరాశులతో.. తరలివచ్చే సిరిసంపదలతో.. తిరుగులేని అనుబంధాల అల్లికలతో.. మీ జీవితం ఎప్పుడు దినదినం వృద్ధి చెందాలని, మీ ఇంట్లో కలకాలం పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈ సంక్రాంతి పండగ మీకు ఎనలేని సంతోషాలు, మధురమైన జ్ఞాపకాలు ఇవ్వాలని కోరుకుంటూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున ప్రతి ఒక్కరికీ పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు