కోవిడ్ సంజీవనిని పంపిన భారత్ కు ధన్యవాదాలు : జైర్ బొల్సనారో
Brasilia, January 23: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు వీలుగా రెండు మిలియన్ డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్లను బ్రెజిల్‌కు పంపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ధన్యవాదాలు తెలిపారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని ('Sanjeevni Booti' Against Covid) తీసుకొచ్చి లక్ష్మణుడిని కాపాడినట్టు తమ దేశాన్ని కాపాడినట్టుగా జైర్ బొల్సనారో (Jair Bolsonaro) భావించారు.
ఈ సందర్భంగా వ్యాక్సిన్ పంపినందుకు కృతజ్ఞతలు చెబుతూ ‘ధన్యవాద్ భారత్ అంటూ…హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకొస్తున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు ‘నమస్కార్ ప్రైమ్ మినిష్టర్ మోదీజీ ! కోవిడ్ పై పోరులో మేం చేస్తున్న పోరుకు మీరు కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు.. ఇది మాకు గర్వకారణం కూడా’ అని తెలిపారు.
దీనిపై ప్రధాని మోదీ (Narendra Modi) స్పందిస్తూ... ‘‘మాకే గౌరవంగా భావిస్తున్నాం. కొవిడ్-19 సంక్షోభంపై (Covid 19 Crisis) చేస్తున్న సంయుక్త పోరాటంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఓ నమ్మకమైన భాగస్వామిగా ఉంటారు. ఆరోగ్య రంగంలో మా సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా కొనసాగుతాం..’’ అని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీదారుల్లో ఒకటైన భారత్ శుక్రవారం నుంచి కరోనా వ్యాక్సిన్ వాణిజ్య ఎగుమతులను ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్ నుంచి బ్రెజిల్‌కు రెండు మిలియన్ డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపించారు. కరోనా కారణంగా తీవ్ర దుష్ప్రవాన్ని ఎదుర్కొన్న దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే.
అత్యవసరంగా కోవిడ్ వ్యాక్సిన్ కావాలని బ్రెజిల్ చేసిన విజ్ఞప్తికి భారత్ స్పందించి పంపించింది. అయితే కరోనా ప్రారంభ దశలో బ్రెజిల్‌కు మనదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మేడిన్ ఇండియాలో భాగంగా తయారైన కోవీషీల్డ్ టీకాలు బ్రెజిల్ చేరుకున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తన ట్వీట్లో తెలిపారు.