ప్రాణం తీసిన కోడి ధర
కోడి ధర మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముతున్నారని అనుమానంతో జరిగిన గొడవ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని జాంగీర్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల లోకి వెళితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన షిరాజ్ బతుకుదెరువు కోసం ఢిల్లీ వచ్చి చేపల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో తన ఇంటి ముందే చిన్న షెడ్డును ఏర్పాటు చేసుకొని లైవ్ చికెన్ అమ్మకాలను కూడా ప్రారంభించాడు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చికెన్ కొనుగోలు చేయడానికి షిరాజ్ వద్దకు షా ఆలమ్ అనే వ్యక్తి వచ్చాడు. చికెన్ ధర ఎంత అని ఆలమ్ అడగ్గా.. షిరాజ్ ధర చెప్పాడు.
మార్కెట్ రేటు కంటే ధర ఎక్కువ చెబుతున్నావంటూ షా ఆలమ్ షిరాజ్‌తో వాదనకు దిగాడు. ఇరువరి మధ్య మాటా మాట పెరగడంతో షా ఆలమ్ షిరాజ్‌ను కిందకు తోశాడు. ఇద్దరు వాదులాటలో ఉండగా ఇంతలో షా ఆలమ్ సోదరులు కత్తులు , రాడ్లతో అక్కడికి చేరుకొని షిరాజ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో షిరాజ్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి.ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షిరాజ్‌ను మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. షా ఆలమ్, అతని సోదరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ విజయంత ఆర్య పేర్కొన్నారు.