మాస్క్ వివాదంలో మలుపు.. తప్పుచేశానన్న నర్సీపట్నం డాక్టర్
కరోనా వైరస్ తో పోటీపడుతూ ఏపీలో రాజకీయ వేడి కూడా కొనసాగుతుంది. కొవిడ్-19పై పోరులో సీఎం జగన్ దారుణంగా ఫెయిలయ్యారని ఆరోపిస్తోన్న ప్రతిపక్ష టీడీపీకి నర్సీపట్నం డాక్టర్ వీడియో కొత్త ఆయుధంగా దొరికింది. కాగా, అపిడమిక్ చట్టం అమలులో ఉండగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోపాటు ముఖ్యమంత్రుల్ని వాడు వీడు అని తిట్టినందుకుగానూ సదరు నర్సీపట్నం డాక్టర్ సుధారక్ రావుపై ఏపీ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది, కేసు కూడా పెట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని కూడా టీడీపీ తప్పుపట్టింది. ఈలోపు డాక్టర్ కూడా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు.
ఏపీలో కొవిడ్-19 రోగులకు చికిత్స చేస్తోన్న డాక్టర్లకు కనీసం N95 మాస్కులు కూడా లేవని, ఇలాగైతే రాష్ట్రంలో వైరస్ మరింతగా వ్యాపిస్తుందని, అదే తెలంగాణలో మాత్రం డాక్టర్లు వైద్య సిబ్బందిని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారని సుధాకర్ ఆరోపించారు. అయితే వీడియో చేయడానికి ముందు ఆయన టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుణ్ని కలిశారని, ఇదంతా రాజకీయ డ్రామా అని వైసీపీ ఎదురుదాడి చేసింది. అసలాయన డాక్టరా? రాజకీయ నాయకుడా? అని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. మరుసటిరోజే నర్సీపట్నం డాక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాదు, డాక్టర్ వ్యాఖ్యలపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
ముఖ్యమంత్రుల్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడి తప్పు చేశానని, అయితే సమస్య తీవ్రంగా ఉండటం వల్లే ఆ స్థాయిలో ఆవేదన వ్యక్తమైందని డాక్టర్ సుధాకర్ చెప్పుకొచ్చారు. సస్పెన్షన్ నా బ్యాడ్ లక్. సమాజానికి మంచి చేద్దామనే ఆ వీడియో చేశాను. నిజానికి నేనొక దళితుణ్ని. కాబట్టే గిరిజనుల్ని సోదరుల్లాగా భావిస్తాను. నర్సీపట్నం ప్రాంతంలోని గిరిజనులు ఎక్కువ. మాస్కులు అందించకపోతే పెను ప్రమాదం తలెత్తుతుందనే నేనా వీడియో చేశాను. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. నేను టీడీపీ కార్యకర్తను కాను అని తెలిపారు.