లాక్‌డౌన్ పట్టని జనం.. యథేచ్ఛగా తిరిగేస్తున్నారు, ప్రభుత్వం ఏమి చేసిందంటే.!

Tuesday, March 24, 2020 07:49 PM News
లాక్‌డౌన్ పట్టని జనం.. యథేచ్ఛగా తిరిగేస్తున్నారు, ప్రభుత్వం ఏమి చేసిందంటే.!

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. దీనిలో భాగంగా రవాణా వ్యవస్థను స్తంబింప చేశారు. బస్సులు, మెట్రో, ఆటోలు, క్యాబ్‌లను సైతం రద్దు చేశారు. అత్యవసర విభాగాలకు చెందిన వాహనాలు, ప్రజాసేవ విభాగంలోని సిబ్బందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ ప్రభుత్వ వెసులుబాటును కొందరు నగరవాసులు దుర్వినియోగం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా జనాలు తిరుగుతున్నారు. ప్రైవేటు బస్సులు, ఆటోలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఒక్కో వాహనంపై ముగ్గురు, నలుగురు తిరుగుతున్నారు. ఇవాళ ఉదయం జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్ లాంటి కొన్ని జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ పోలీసులే లేరు. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో పూర్తి స్థాయి నియంత్రణ అవసరమని, స్వీయ నియంత్రణలో జనం ఉండాలని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చెప్తున్నా జనం మాత్రం ఏమీ పట్టనట్టే రోడ్ల మీదే తిరుగుతున్నారు. కనిపించని శత్రువుతో పోరాటానికి బెంబేలెత్తి దేశాధినేతలే చేతులెత్తేస్తుంటే. జనం ఇలా చేయడం ఎంత వరకు సబబని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరీంనగర్ జిల్లా వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. దీంతో కరీంనగర్ వాసులు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. నగరంలో జనం అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. జనమంతా ఇంటికే పరిమితమవడంతో మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల అధికారులు బ్లీచింగ్ స్ప్రే చేశారు. జహీరాబాద్‌లోని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న బైక్‌లు, బస్సులు, లారీలను పోలీసులు అడ్డుకుని నిలిపివేస్తున్నారు. పాలు, కూరగాయలు, మందులకు సంబంధించిన వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్టు దగ్గర హెల్త్, పోలీస్, రవాణాశాఖ సిబ్బంది 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో పని చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: