హాస్టల్స్ మూసివయటలేదు, తగిన చర్యలు తీసుకున్నాము - కేసీఆర్

Thursday, March 26, 2020 01:29 PM News
హాస్టల్స్ మూసివయటలేదు, తగిన చర్యలు తీసుకున్నాము - కేసీఆర్

హైదరాబాద్‌లో హాస్టళ్లను మూసివేయొద్దని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. హాస్టళ్లు, పేయింగ్‌ గెస్ట్‌ యాజమాన్యాలతో మాట్లాడి.. వాటిల్లో ఉంటున్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌,  నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌ల మూసివేతతో ఏపీ విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి కేటీఆర్‌ దృష్టికి, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌చేసి హైదరాబాద్‌లో హాస్టళ్లు ఖాళీ చేయిస్తుండటం వల్ల వారికి రవాణా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఈ సమయంలో ఒక చోట నుంచి మరొకచోటుకు కదలడం శ్రేయస్కరం కాదన్నారు. ఇదే అంశాలను ఏపీ సీఎస్‌  నీలం సహానీ తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పారు.

వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ హాస్టళ్లను,  పీజీ మెస్‌లను మూసివేయవద్దని  స్పష్టమైన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేట్‌ సంస్థల్లో ఉన్నవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. ఏమైనా సమస్యలు ఉంటే 1902కు కాల్‌ చేయాలని సూచించింది.

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఇండ్లనుంచి బయటకు రావొద్దని,  ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటిపాస్‌లు, ఎన్వోసీలు జారీచేయడంలేదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్టళ్లు, పేయింగ్‌గెస్ట్‌లుగా విద్యార్థులు ఉంటున్న భవనాల నిర్వాహకులు వాటిని మూసివేయవద్దని ఆదేశించారు. ఒత్తిడిచేసి విద్యార్థులను బయటకు పంపితే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
రాష్ట్రం లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లోని ప్రైవేటు వసతిగృహాల నిర్వాహకులు హాస్టళ్లు ఖాళీచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తాము సొంతూర్లకు వెళ్లేందుకు అనుమతిపత్రాలు ఇవ్వాలంటూ అమీర్‌పేట్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, బాలానగర్‌, దుండిగల్‌, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ల వద్ద విద్యార్థులు పెద్దఎత్తున బారులుతీరారు. అయితే అత్యవసరపరిస్థితిని బట్టి కొద్దిమందికి ఎస్‌హెచ్‌ఓలు అనుమతిపత్రాలు జారీచేశారు. అత్యవసరం ఉంటేనే అనుమతి ఇచ్చామని, అందరికీ ఇవ్వడంలేదని పోలీస్‌ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. సొంతగ్రామాలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారంటూ పలువురు పోలీస్‌స్టేష్టన్ల వద్దకు వచ్చారు. పెద్దసంఖ్యలో వారు తరలిరావడంతో ఒకదశలో వారిని అదుపుచేయడం పోలీసులకు సాధ్యంకాలేదు. ప్రజలు ఏవైనా ఫిర్యాదులు ఇవ్వాలంటే సీపీ కార్యాలయానికి రావాల్సిన పనిలేదని, covid19.hyd@gmail.com ఈ మెయిల్‌కు లేదా 9490616780 వాట్సప్‌ నంబర్‌కు పంపవచ్చని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. పోలీసులే బాధితుల వద్దకు వస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా అత్యవసర విధుల్లో ఉండే సిబ్బందికి ప్రత్యేకంగా పాస్‌లు జారీచేస్తున్నట్టు తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: