72 ఏళ్ల తర్వాత..మళ్లీ నిర్మానుష్యం
భాగ్యనగరం విశ్రమించింది. ప్రశాంత వాతావరణంలో సేదతీరింది. కరోనా కట్టడికి పోరాటంలో ముందు నిలిచింది. ఆదివారం అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, అమీర్‌పేట, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్,ఎల్‌బీనగర్, మాదాపూర్ ఇలా..వీధులన్నీ ఖాళీ అయ్యాయి.గ్రేటర్ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయింది. జనమంతా కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల ముందరకు వచ్చిచప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. వారి సేవలకు సలాం చేశారు.
కోవిడ్ నివారణ కోసం ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ..72 ఏళ్ల నాటి పరిస్థితిని తలపించిందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. 1948 సెప్టెంబర్ 15,16,17 తేదీల్లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో చేరిన సందర్భంలో చూసిన నిర్మానుష్యం మళ్లీ ఆదివారం సాక్షాత్కరించిందని పలువురు పేర్కొన్నారు. అప్పట్లో మిలటరీ భయంతో ఎవరూ బయటకు వెళ్లకపోగా, ఇప్పుడు ఎవరికి వారు స్వీయ నియంత్రణ వల్లేనని ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డిపేర్కొన్నారు.