దేశంలో కొత్తగా 20 కొత్త వైరస్ కేసులు, మొత్తం 58కు చేరిక

Thursday, March 4, 2021 04:00 PM Offbeat
దేశంలో కొత్తగా 20 కొత్త వైరస్ కేసులు, మొత్తం 58కు చేరిక

New Delhi, January 5: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గుతుండ‌గానే యూకేలో విజృంభిస్తున్న క‌రోనా న్యూ స్ట్రెయిన్ (COVID-19 New Strain) క‌ల‌క‌లం రేపుతున్న‌ది. దేశంలో కొత్త వేరియంట్‌ కరోనా కేసులు (Coronavirus New Strain) రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 58కి చేరింది. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా 20 యూకే కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 58 మందిలో కొత్త రకం కరోనా లక్షణాలు (Coronavirus Mutant) బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నాటికి 38 మందిలో న్యూ స్ట్రెయిన్ ధృవీకరణ కాగా, మంగళవారం కొత్తగా మరో 20 మందిలో న్యూ స్ట్రెయిన్ బయటపడిందని  వెల్లడించింది

యూకేలో రెండు వారాల క్రితం క‌రోనా న్యూ స్ట్రెయిన్ ప్ర‌భావం మొద‌లైంది. మునుప‌టి క‌రోనా వైర‌స్ కంటే ఈ కొత్త ర‌కం క‌రోనా ఉత్ప‌రివర్త‌నం అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న‌ద‌ని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఇటీవ‌ల యూకే నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారి ద్వారా ఈ న్యూ స్ట్రెయిన్ దేశంలో ప్ర‌వేశించింది. భార‌త్‌తోపాటు డెన్మార్క్‌, నెద‌ర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ, స్వీడ‌న్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జ‌ర్లాండ్, జ‌ర్మ‌నీ, కెన‌డా, జ‌పాన్‌, లెబ‌నాన్‌, సింగ‌పూర్ దేశాల్లో కూడా న్యూ స్ట్రెయిన్ విజృంభ‌ణ మొద‌లైంది.

ఇదిలా ఉంటే దేశంలో ఒకవైపు కోవిడ్‌-19కేసులు తగ్గుముఖంపడుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు కొత్తకరోనా కేసుల విస్తరణ మాత్రం ఆందోళన పుట్టిస్తోంది.  అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్‌  గేబ్రియేసస్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ఉనికిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ కనుగొనే క్రమంలో ప్రపంచలోని అన్ని దేశాలకంటే భారత్‌ ముందుంది అంటూ అభినందించారు. 

టీకాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తన మనసులోని మాటను బయటపెట్టారు. అదే విధంగా డబ్ల్యూహెచ్‌- భారత్‌ కలిసికట్టుగా ముందుకు సాగితే అత్యంత ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేయవచ్చని టెడ్రోస్‌ పేర్కొన్నారు. తద్వారా ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న బలహీన వర్గాలకు వ్యాక్సినేషన్‌ చేసేలా చర్యలు చేపట్టవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19పై పోరాటంలో నరేంద్ర మోదీ గొప్పగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ఈ మేరకు టెడ్రోస్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు

కాగా సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా కోవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి  చేస్తున్న కోవాగ్జిన్‌లకు దేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.


 
 

For All Tech Queries Please Click Here..!