Burevi Cyclone: తీరాన్ని తాకిన బురేవి తుఫాన్, రెండు రాష్ట్రాలకు భారీ వర్షముప్పు
Amaravati,Dec 4: బంగాళాఖాతంలో నెలకొన్న బురేవి తుపాన్ (Burevi Cyclone) బుధవారం శ్రీలంకలోని త్రికోణమలై వద్ద తీరాన్ని తాకింది. మన్నార్‌వలిగుడా మీదుగా తమిళనాడు సరిహద్దుల వైపుగా కదిలింది. తొలుత పాంబన్‌కు 110 కి.మీ దూరంలో మధ్యాహ్నం వరకు కొన్ని గంటల పాటు ఈ తుపాన్ కేంద్రీ కృతమై ఉండడంతో నాగపట్నం, తిరువారూర్, తంజావూరు డెల్టా జిల్లాల్లో, దిండుగల్, నీలగిరి, తేని కొండ ప్రాంతాలతో నిండిన జిల్లాల్లో, కడలూరు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీగానే వర్షం పడింది. చెన్నైలో తెరపించి తెరపించి అక్కడక్కడ వర్షం పడుతూ వచ్చింది. ఈ బురేవి తుపాన్ దాటికి చెన్నై నుంచి కన్యాకుమారి వరకు సముద్ర తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అనేక తీర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే పరిస్థితి నెలకొంది.
తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లోనే ఈ తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముందు జాగ్రత్తలతో పెనునష్టాన్ని తప్పించే చర్యలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. శివగంగై, మదురై, విరుదునగర్‌లలోనూ అనేక చోట్ల వర్షాలు పడుతూ వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత క్రమంగా ఈ తుపాన్ నైరుతి దిశలో పయనించడం మొదలెట్టింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో గంటకు 16 కి.మీ వేగంతో తీరం వైపుగా బురేవి దూసుకురావడంతో వర్షం తీవ్రత క్రమంగా పెరిగింది.
శ్రీలంకను దాటి మళ్లీ తమిళ భూభాగాన్ని తాకేందుకు బురేవి కదలడంతో అధిక ప్రభావం రామేశ్వరం, మండపం, పాంబన్ సముద్ర తీరాల్లో నెలకొంది. గంటకు 90 నుంచి వంద కి.మీ వేగంతో గాలులు వీయడం, సముద్రంలో అలల తాకడి వెరసి ప్రజల్లో ఆందోళన తప్పలేదు. ముందుగానే తీరవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినా, ఎలాంటి విపత్తు ఎదురవుతుందో అనే ఆందోళన వీడలేదు. ఇందుకు తగ్గట్టుగానే సముద్ర తీరంలోని చెక్‌పోస్టులు, రోడ్లు దెబ్బ తిన్నాయి. పాంబన్ తీరంలో చిక్కుకున్న కొందరు జాలర్లను రక్షించారు. తీరం వైపు సమీపించే కొద్ది సముద్ర తీర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు మొదలయ్యాయి.
బురేవిని ఎదుర్కొనే విధంగా చేపట్టిన ముందు జాగ్రత్తల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. వారం వ్యవధిలో తమిళనాడు రెండు తుపాన్‌లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరించే పనిలో పడింది. ముందు జాగ్రత్తలు ఆగమేఘాలపై జరిగాయి. దీంతో సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడిన అమిత్‌షా ముందు జాగ్రత్తలపై ఆరా తీశారు. విపత్తులు ఎదురైన అందుకు తగ్గట్టు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.