Utah Hiker Slips: వంద అడుగుల పై నుంచి కిందపడినా ప్రాణాలతో బయటపడ్డాడు
అమెరికాలోని ఉటా రాష్ట్ర రాజధాని అయిన సాల్ట్ లేక్ సిటీలో ఎన్‌సైన్ పర్వతం పైకి ఎక్కే ప్రయత్నంలో 29 ఏండ్ల పర్వతారోహకుడు పట్టుజారి పడ్డాడు. ఏకంగా వంద అడుగుల కిందకు దొర్లుకుంటూ వచ్చి తీవ్ర గాయాలతో కొండ అంచున ఆగిపోయాడు. అక్కడి నుంచి మరో రెండడుగులు దొర్లితే కొన్ని వందల అడుగుల కిందకు పడిపోయేవాడు. అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. అయితే దాదాపు మూడు గంటల నరకయాతన తర్వాత ఘటనా ప్రాంతం దిగువన ఉన్న కొందరు అతడిని గమనించారు.
వెంటనే సాల్ట్‌లేక్ సిటీ ఫైర్ డిపార్టుమెంటుకు సమాచారం ఇచ్చారు. దాంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అతికష్టం మీద బాధితుడు పడివున్న ప్రాంతానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటలకుపైగా శ్రమించి అతడిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు.
కాగా, ఈ ఘటనలో బాధితుడి ఒక కాలు విరిగిపోయింది. పొత్తి కడుపులో బలమైన గాయం అయ్యింది. ఇక ఒళ్లంతా రాళ్లు గీరుకుని రక్తసిక్తం అయ్యింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. స్పృహలోనే ఉన్నప్పటికీ ఏమీ మాట్లాడలేక పోతున్నాడని చెప్పారు. కాగా, బాధితుడిని రెస్క్యూ చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
పాపం,,, శిఖరం అంచున ఆగిపోయి చావును జయించినా ఆ పర్వతారోహకుడు నరకయాతన అనుభవించక తప్పలేదు. పర్వతంపై నుంచి పడిపోతుప్పుడు అతని ఒంటి నిండా గాయాలయ్యాయి. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కిందపడిపోయింది. ఇక తన దగ్గరున్న ఫ్లాష్ లైట్ వేస్తూ ఆర్పుతూ సంజ్ఞలు చేశాడు. అయినప్పటికీ ఎవరూ చూడలేదు. కాపాడమంటూ పదే పదే చేతులు ఊపినా ఎవరికి కనిపించక మూడు గంటలు నరకయాతన అనుభవించాడు.