జాక్ మా ఈ మూడు నెలలు ఎక్కడ ఉన్నారు.. ఏమయ్యారు..?
Beijing, January 20: చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు బిలియనీర్ జాక్ మా దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అదృశ్యం వెనకు చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా అధికారిక మీడియా బుధవారం ఓ వీడియోను (Alibaba Founder Makes First Public Appearance) విడుదల చేసింది. జాక్‌మా వందమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ఉపాధ్యాయులతో వర్చువల్ భేటీ నిర్వహిస్తున్నారంటూ ఓ వీడియోను (Jack Ma is Back) పోస్ట్ చేసింది.
కరోనా మహమ్మారి ముగిన తర్వాత మళ్లీ మనం కలుద్దామని ఆ గ్రామీణ ఉపాధ్యాయులతో జాక్ మా (Jack Ma) అన్న వీడియోను గ్లోబల్ టైమ్స్ చూపించింది. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. తొలుత ఇంగ్లీష్ టీచర్‌గా పని చేసిన జాక్ మా ఆ తర్వాత అలీబాబా సంస్థను స్థాపించారు. అయితే ప్రతి ఏడాది ఆయన గ్రామీణ టీచర్లకు క్లాసులు తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగింది. త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని వారికి తెలిపారు. ఇది వీడియో సారాంశంగా ఉంది.
అయితే వ్యాపారవేత్తలు మాత్రం ఈ వీడియోపై కొంత సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా టీవీ షోలకు గానీ, సోషల్ మీడియాకు గానీ జాక్‌మా దూరంగా ఉంటారని వారు పేర్కొంటున్నారు. హఠాత్తుగా జాక్‌మా ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమేంటని ప్రశ్నిస్తున్నారు. జాక్ మా వీడియో కాన్ఫరెన్స్‌కు సంబందించి వీడియో తొలుత ఓ లోకల్ బ్లాగ్‌లో ప్రచారం కాగా.. ఆ తర్వాత మీడియా, సోషల్ మీడియాలో వైరలయ్యింది.
కాగా గతేడాది నవంబర్ నుంచి ఆయన బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. చైనా ప్రభుత్వ ఆర్థిక విధానాలపై, బ్యాంక్ రెగ్యులేటరీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చైనా బ్యాంకుల తీరును ఎండగట్టిన నాటి నుంచి జాక్ మా బహిరంగంగా కనిపించలేదు. ఇక ఆయన నిర్వహించే ‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ షోకు కూడా హాజరు కాలేదు. ఆయన తరపున ఆలీబాబా ఎగ్జిక్యూటివ్ ఒకరు పాల్గొన్నారు. జాక్ మా షెడ్యూల్ బిజీగా ఉన్నందున రాలేకపోయారంటూ ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. దాంతో జాక్ మా మిస్సింగ్ అంటూ రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వ్యతిరేకంగా మాట్లడటంతో జిన్‌పింగ్ ఆయనను ఏమైనా చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తాయి. ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. జాక్ మా కనిపించారు.