Kisan Diwas: ఓ చరణ్ సింగ్..నీ దినానికి ఈ రాజ్యం శుభాకాంక్షలు చెబుతోంది వినవయ్యా..

Saturday, February 13, 2021 02:15 PM Offbeat
Kisan Diwas: ఓ చరణ్ సింగ్..నీ దినానికి ఈ రాజ్యం శుభాకాంక్షలు చెబుతోంది వినవయ్యా..

నాటి రైతే రాజు..దున్నేవాడిదే భూమి నినాదం కాస్తా రైతు రాజు కాదు.. దున్నేవాడిది భూమి కాదుగా మారింది. దేశానికి వెన్నెముక అంటూ నీరాజనాలు అందుకున్న రైతు నేడు తన వెన్నెముకను కోల్పోయి ఐసీయూలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. బంగారం కళ్ళ ముందు ఉన్నా.. కళ్లలోని ఆశలన్నీ ఆవిరై జీవచ్ఛవమై రోదిస్తున్నాడు. మట్టిని నమ్ముకుని ఆ మట్టిని తింటూ పది మందికి అన్నం పెట్టే రైతుపై ఎందుకో ప్రతి ఒక్కరూ పగబట్టారు.. 

రైతెక్కడా అని కలవరించే లోకం కర్షకుడిపైనే వెకిలి వ్యాఖ్యలు చేస్తుంటే... రైతన్నా ఈ రోజు నీకు దినమంట కదా అంటూ ఈ రాజ్యం శుభాకాంక్షలు (Kisan Diwas) చెబుతోంది. నిజమే..రైతుకు నిజంగా దినమే.. ఈ రైతు దినానికి కారకుడైన రైతుబంధును (Chaudhary Charan Singh) కూడా ఓ సారి తలుచుకోవాలి.

చౌదరీ చరణ్ సింగ్.. రైతు కుటుంబంలో పుట్టి ప్రధానిగా ఎదిగిన రైతు బిడ్డ.. ఆరు నెలల తిరగకముందే పార్టీ ఆడిన నాటకంలో ప్రధాని పదవిని వదిలిన నేత.. సోవియట్-శైలి ఆర్థిక సంస్కరణలపై జవహర్ లాల్ నెహ్రూ విధానాలను వ్యతిరేకించినందుకు అతని జీవితం అంధకారమైపోయింది. భారతదేశంలో సహకార సేద్యం విజయవంతం కాదని..ఒక రైతు కుమారునిగా, ఒక రైతుకు సరైన యాజమాన్య హక్కు అతను వ్యవసాయదారునిగా ఉండడమేనని చెప్పినందుకు అతన్ని ఆనాటి పార్టీ దూరంగా వెలేసేంది. రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించాలనుకున్నందుకు జైలుకు వెళ్లేలా చేసింది.. ఇది క్లుప్తంగా జాతీయ రైతు దినోత్సవం కు (National Farmers' Day) ఆధ్యుడైన చరణ్ సింగ్ చౌదరీ కథ.. 

రైతుబంధు చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్లే జమీందారీ చట్టం (zamindari system) రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము వచ్చింది. అలాగే మరికొందరు నాయకుల ఆలోచనల నుండి భూసంస్కరణలొచ్చాయి. పేదలకు భూముల పంపిణీ జరిగింది. వ్యవసాయదారులకు అనుకూలమైన  పలు రకాల విధానాలను రూపొందించడం జరిగింది. రైతులను  వడ్డీవ్యాపారుల కబంధహస్తాలనుండి విడిపించి వారికి బ్యాంకు ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టేలా చేయడం జరగింది. దీని వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయి. ఈ సేవలకే ప్రభుత్వం చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని (National Farmers Day) జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.

ఎక్కువ కాలం వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ ఒకే ఒక్క బడ్జెట్ ని (1979-80 Charan Singh Budget) పార్లమెంట్ కి సమర్పించాడు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఉప ప్రధాని, ఆర్థిక మంత్రిగా ఉన్న చరణ్ సింగ్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే రైతు కలల బడ్జెట్ గా మారింది. అందులో వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వేశారు. వ్యవసాయంతో పాటు ఈ బడ్జెట్ 7వ ఆర్థిక కమిషన్ సిఫారసులను అంగీకరించింది. ఈ బడ్జెట్ లోనే యూనియన్ ఎక్సైజ్ సుంకాలలో రాష్ట్రాల వాటాను 20% నుండి 40% కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.పెట్రోలియంను ఎగుమతి చేసే దేశాలు లేదా ధరలు పెంచే దేశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ఎక్సైజ్ సుంకాన్నిపెంచారు. ఇండియన్ పోస్టల్ సర్వీసుల్లో ఇన్ లాండ్ కవర్స్, టెలిగ్రాంల మీద ధరలు పెంచారు. 

చరణ్ సింగ్ ఎవరు..?
1857 భారతీయ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన రాజ్‌నహర్ సింగ్ మనవడే ఈ చరణ్ సింగ్.. దుర్భేధ్యమైన బ్రిటీష్ ప్రభుత్వం చేతిలో ఓటమి తరువాత అణిచివేత నుండి తప్పించుకునేందుకు  రాజ్‌నహర్ సింగ్ తన అనుచరులతో  ఉత్తర ప్రదేశ్లోని బులందర్షర్ జిల్లాకు వెళ్లాడు.. అక్కడే చరణ్ సింగ్ జన్మించాడు.  ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో గల నూర్ పూర్ గ్రామంలో జన్మించిన చరణ్ సింగ్ ఉన్నత విద్యావంతుడు.. లా చదివాడు.. సైన్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 

1929లో కాంగ్రెస్ పార్టీలో చేరిన చరణ్ సింగ్ చౌదరీ 1937లో 34 ఏళ్ల వయసులో యూపీలోని ఛత్రౌలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మంత్రిగా ఆ తరువాత సంవత్సరమే 1938 లో అసెంబ్లీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ బిల్లును ప్రవేశపెట్టాడు.  వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ బిల్లు ఆ తర్వాత భారతదేశంలో చాలా రాష్ట్రాలచే ఆమోదించబడింది. 1940లో పంజాబ్ ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. 

అయితే  కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా బయటకు వచ్చి 1967లో భారతీయ క్రాంతి దళ్ పార్టీని స్థాపించారు. అదే ఏడాది  రాజ్‌నారాయణ్, రామ్‌ మనోహర్ లోహియాల మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. రెండవసారి 1970లో కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో సీఎం పదవిలో కూర్చున్న కొద్ది రోజులకే 1970 అక్టోబరు 2 న కేంద్రం చరణ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. 

ఇక ఎమర్జెనీ సమయంలో ఇందిరా గాంధీ ఈయన్ని జైలుకు కూడా పంపించింది. ఇది1975లో జరిగింది. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం చౌదరీ చరణ్ సింగ్ సీనియర్ నాయకునిగా కాంగ్రెస్ ప్రత్యర్థులు స్వీకరించడం వెనువెంటనే జరిగిపోయాయి. ఇక్కడ 1974 నుండి 1977 వరకు చరణ్ ది ఒంటరి పోరాటమనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం 1979లో ప్రధాని కావడం వెనువెంటనే జరిగిపోయాయి. 1977లోనే ప్రధాని రేసులో నిలబడినా జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయ్ ని ఎంపిక చేయడంతో చరణ్ ఆశయం నెరవేరలేదు. 

ఇక ఇందిరాంగాంధీని ఢీకొట్టిన రాజ్ నారాయణ సహకారంతో  1979 లో ప్రధానిగా చరణ్ సింగ్ ఎన్నికయ్యారు. 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం..ప్రభుత్వం కూలిపోవడంతో.. కేవలం 24 వారాల్లోనే ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి 1987లో చనిపోయే వరకు లోక్ దల్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ప్రతిపక్షంలోనే ఉండిపోయారు.  ఆయన మరణం తర్వాత చరణ్ సింగ్ సమాధికి కిసాన్ ఘాట్ (Kisan Ghat) అని ప్రభుత్వం పేరు పెట్టింది.  అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఉన్న అమృత్ సర్ విమానాశ్రయానికి "చౌధురి చరణ్ సింగ్ అంతర్జాతియ విమానాశ్రయం"గా నామకరణం చేసింది. మీరట్ లోని విశ్వవిద్యాలయానికి "చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం"గా, ఎటావా జిల్లాలోని కళాశాలకు "చౌదరి చరణ్ సింగ్ పోస్టు గ్రాడ్యుయేట్ కళాశాల"గా. బులంద్‌షహర్ జిల్లాలో ఒక ఆసుపత్రికి అతని పేర్లు పెట్టారు.

బతికి ఉన్నప్పుడు చరణ్ సింగ్ కు అడుగడుగునా అడ్డకులను ఏర్పరచిన ప్రభుత్వం ఆయన చనిపోయాక జాతీయ రైతు దినోత్సవం అంటూ ఆయన జన్మదినాన్ని ప్రకటించింది. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం (కిసాన్ దివాస్) గా జరుపుకోగా.. భారతదేశపు రైతుల విజేత అంటూ ఆయన కీర్తింపబడుతున్నారు. 

మనవాయిస్ మాట : రైతు రాజైన చోటే బంగారపు కాంతులు ప్రసరిస్తాయి. అది నిజంగా జరగాలని కోరుకుందాం 


 

For All Tech Queries Please Click Here..!