AP Assembly Winter Session: 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు: ఏపీ సీఎం వైయస్ జగన్ 

Wednesday, January 13, 2021 02:15 PM Politics
AP Assembly Winter Session: 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు: ఏపీ సీఎం వైయస్ జగన్ 

Amaravati, Nov 30: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు వాడి వేడీగా సాగాయి. టీడీపీ సభ్యుల సస్పెన్సన్ తో తొలి రోజు సమావేశాలు ముగిసాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. అలాగే పంచాయితీ రాజ్ చట్ట సవరణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా తొలి రోజు సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూ చంద్రబాబు పోడియం ముందు తన ఎమ్మెల్యేలతో బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ వారిపై ఒక రోజు సస్పెన్సన్ విధించారు. చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ ఆయన వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం.. చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభా సమావేశాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం మంగళవారానికి వాయిదా వేశారు. మరో వైపు శాసన మండలి సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

ఏపీ సీఎం మాట్లాడుతూ.. నివర్‌ తుపాన్‌తో నష్టపోయిన రైతులను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పంట నష్టంపై సభలో  ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.  అసెంబ్లీలో మాత్రం ఎల్లో మీడియా కవరేజ్‌ కోసం డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. సీబీఎన్‌ అంటే కరోనాకు భయపడే నాయుడు అని విమర్శించారు. సభలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో అర్థం కావడం లేదని అన్నారు. తాను అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. 
  
చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌
సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బీ అశోక్‌, పయ్యావుల కేశవ్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బుచ‍్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌ సస్పెండ్‌ అయ్యారు. సభ నుంచి బైటకు వచ్చి అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో ఆవేశంతో ఊగిపోయారు. అధికార పక్షంవైపు వేలు చూపిస్తూ వాగ్యుద్దానికి దిగారు. టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిమ్మల రామానాయుడికి మాట్లాడే అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా టీడీపీ సభ్యులు గలాటా సృష్టించడంపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. తన తప్పులను కప్పిపుచ్చకునేందుకు చంద్రబాబు సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
 
అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
అంతకుముందు శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. పంచాయతీ రాజ్  చట్ట సవరణ బిల్లుపై చర్చించకుండా ఆమోదించినందుకు నిరసనగా వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వ్యవసాయం రంగంపై చర్చ కావాలని వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. అదే అంశంపై చర్చ జరుగుతుంటే వాకౌట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే అంశంపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబులా నటించడం తమ ముఖ్యమంత్రికి రాదని టీడీపీకి చురక అంటించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని చెప్పారు.

For All Tech Queries Please Click Here..!