AP Assembly Winter Session: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి
Amaravati, Nov 26: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Assembly Winter Session) జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది.
ఇదిలా ఉంటే ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్‌పై జగన్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పరిమితమైంది. ఇకపై గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలు ఏస్ఈబి పరిధిలోకి తీసుకువచ్చింది.
పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల్ వలవెన్, పరిశ్రమల డైరెక్టర్ జెవిఎన్ సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ ఎండీ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ ఈడీ పి.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.