AP Winter Session 2020: అసెంబ్లీ నుంచి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
Amaravati, Nov 30: అసెంబ్లీ సమావేశాల్లో తుపాను నష్టంపై వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు మాట్లాడుతున్న సంధర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. దీంతో చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ ( Chandrababu naidu and tdp mlas suspended) చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్ సస్పెండ్ అయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతుండగా తనకి మైక్ కావాలంటూ చంద్రబాబు పోడియం ముందు బైఠాయించారు. ఈ నేపథ్యంలో సభలో (AP Assembly winter session) చర్చ సాగకుండా అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులపై స్వీకర్ చర్యలకు ఉపక్రమించారు. శాసనసభ నుంచి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలను నేటి సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు
చర్చకు అడ్డుపడ్డ ప్రతిపక్ష సభ్యులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టుగా కూడా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. సభలో మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలని సూచించారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని వివరించారు. ఒకసారి క్లారిటీ ఇచ్చాక మళ్లీ అదే అంశంపై మాట్లాడటం సరికాదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. సభలో చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో జరిగిపోతుందని మళ్లీ పోడియం ముందు కూర్చున్నారని విమర్శించారు.