ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కట్టలు.
చెన్నై లోని పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో ఇళ్ల ముందు గుర్తు తెలియని వ్యక్తులు కరెన్సీ నోట్లు విసిరేస్తున్నారు. ఇలా విసిరేయడంపై కరోనా వైరస్ వ్యాప్తికి కుట్ర ఏదైనా జరుగుతుందా అనే అనుమానాలు చోటు వస్తున్నాయి. చెన్నై మాధవరం పాలకొట్టం సమీపం కేకే తాళై మాణిక్యం వీధిలో ఈనెల 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సైకిళ్లపై వచ్చారు. లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న ఆ పరిసరాల్లోని ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను చల్లారు. అనుమానంతో స్థానికులు వారిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోయారు.
వారంతా ఇళ్ల ముందు కరెన్సీ నోట్లను ఎందుకు చల్లిపోతున్నారో ఎవ్వరికీ అంతుబట్టలేదు. కరోనా వైరస్ భయంతో ఉన్న ప్రజలు ఎవ్వరూ ఆ నోట్లను తాకటంలేదు. కాగా స్థానిక మహిళ ఇదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఆ నోట్లను ఎవ్వరూ తాకవద్దు, వైరస్ సోకే ప్రమాదం ఉంది, సైకిల్‌పై సంచరిస్తూ కరెన్సీ నోట్లను వెదజల్లుతున్న గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి పోలీసులు చర్యలు చేపట్టాలని ఆమె కోరింది. ఈ పోస్టింగ్ పోలీసులకు చేరడంతో తాళై మాణిక్యం వీధిలోని సీసీటీవీ కెమెరాల పుటేజీ సహాయంతో వారికోసం గాలిస్తున్నారు. చెన్నై పురుసైవాక్కం, వెస్ట్ మాంబళంలో సైతం ఇళ్ల ముందు కరెన్సీనోట్ల∙సంఘటనలు చోటుచేసుకున్నాయి. సామాజిక కార్యకర్తలు కొందరు ఈ ఘటనలపై స్పందిస్తూ, ఇళ్లలో దొంగతనాలు చేసేందుకు డబ్బులు ఎరగా వేసి ఉంటారని అన్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ ప్రబలుతున్నట్లు ఇంతవరకు నిర్ధారణ కాకున్నా అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.