మాస్కులు కూడా లేవ్: డాక్టర్ సుధాకర్ అటాక్: వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేవని, కరోనా పాజిటివ్ పేషెంట్లకు చికిత్సను అందిస్తోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి జగన్ సర్కార్ కనీసం మాస్కులను కూడా సరఫరా చేయలేకపోతోందని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలు తాజాగా కలకలం రేపుతున్నాయి.. డాక్టర్ సుధాకర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే పనిలో పడింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరోనా వైరస్ సోకిన పేషెంట్లు, డాక్టర్ల, వైద్య సిబ్బంది కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) అందుబాటులో ఉన్నాయని చెబుతోంది. డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణల వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ నర్సీపట్నం శాసనసభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడానికి ముందు ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లొచ్చారని మండిపడుతున్నారు.
ఒక్క ఎన్95 మాస్క్‌ను కనీసం 15 రోజుల పాటు వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారని, దీనికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందని డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ముందు ఆయన అయ్యన్న పాత్రుడి ఇంటికి వెళ్లొచ్చారని తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆయన మీడియాకు విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లిన డాక్టర్ సుధాకర్ సాయంత్రం 5 గంటల తరువాత బయటికి వచ్చారని, అవన్నీ సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయని అన్నారు. కరోనా వల్ల దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీన్ని కూడా తమకు అనుకూలంగా, రాజకీయ అవసరాల కోసం టీడీపీ నాయకులు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించామని, పీపీఈ కిట్లను అందజేశామని చెప్పారు