PM Modi Phone Call: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ ఫోన్
New Delhi, Oct 14: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi Phone Call) ఆరా తీశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి వర్షాలు, అనంతర పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. వాయుగుండం తీరం దాటిందని ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు.
అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు. హైదరాబాద్ పరిస్థితిని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని అభయమిచ్చారు.
కాగా,భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ధాటికి అతలాకుతలమైపోయింది. వరద సహాయక చర్యల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికార యత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయి.