ఖాతాలలో రైతు భరోసా నగదు జమ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుంది. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అధికారులు తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే రైతన్నలకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది కూడా అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. కాగా, తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికంగా ఉండటం గమనార్హం.