Christian Coleman: క్రిస్టియన్ కోల్‌మన్‌పై రెండేళ్ల పాటు నిషేధం
పరుగుల వీరుడు.. వంద మీటర్ల రేసులో ప్రపంచ చాంపియన్, అమెరికాకు చెందిన క్రిస్టియన్ కోల్‌మన్‌పై వేటు పడింది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోల్‌మన్‌పై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ స్వచ్ఛత విభాగం బుధవారం ప్రకటించింది. అతనిపై నిషేధం 2022 మే నెలతో ముగియనుంది. దీంతో 24 ఏళ్ల కోల్‌మన్ వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు దూరం కానున్నాడు.
డోపింగ్ నిబంధనల ప్రకారం ప్రతి అథ్లెట్ ఏడాదిలో మూడుసార్లు తమ శాంపిల్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు అతిక్రమించినా, రెండేళ్ల నిషేధం ఎదుర్కోక తప్పదు. కోల్‌మన్ గతేడాది ఈ నిబంధనను ఉల్లంఘించాడు. శాంపిల్ సేకరణకు వచ్చిన అధికారులకు తాను ఎక్కడ ఉన్నాడన్న సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది మే నుంచి కోల్‌మన్‌పై నిషేధం విధిస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ స్వచ్ఛత విభాగం నిర్ణయం తీసుకుంది.
కాగా, తన నిషేధంపై కోల్‌మన్ అత్యున్నత క్రీడా న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో సవాల్ చేసుకోవచ్చు. నిరుడు దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి్‌పలో 100 మీటర్లు, 4గీ100 మీటర్ల రిలే ఈవెంట్లలో స్వర్ణాలు నెగ్గి కోల్‌మన్ టోక్యో విశ్వక్రీడలకు ఫేవరెట్‌గా నిలిచాడు. తాజా నిషేధంతో అతని ఒలింపిక్ పతక ఆశలు అడియాసలయ్యాయి.