Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కరోనా, భారత జట్టు సహాయ సిబ్బందిలో కోవిడ్ కలకలం
ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం నేషనల్ లీగ్ గేమ్స్ ఆడుతున్న కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే జట్టును వీడి హోంఐసోలేషన్‌కు వెళ్లినట్లు పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ పేర్కొంది. కాగా రొనాల్డొ కరోనా పాజిటివ్ అని తేలినా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో అతను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. మరోవైపు కరోనా బారిన పడిన రొనాల్డో త్వరగా కోలుకోవాలంటూ అతని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా రొనాల్డొ పోర్చుగల్ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్ సాధించాడు.
భారత జట్టు సహాయ సిబ్బందిలో కరోనా కలకలం
భారత జట్టు సహాయ సిబ్బందిలో కరోనా కలకలం రేగింది. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడు వైదొలగినట్టు బీసీసీఐ తెలిపింది. ఇటీవల దుబాయ్ చేరిన భారత జట్టు సహాయ బృందంలో రఘు లేని విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ పయనమయ్యే ముందు సహాయ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా రఘుకు పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ వివరించింది. టెస్టు క్రికెటర్లు పుజార, విహారి మినహా మిగిలిన ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఆడుతుండడంతో రఘు గైర్హాజరీ పెద్ద సమస్య కాబోదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.