పృథ్వీ షా స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేస్తే మంచిది: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
హైదరాబాద్: సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన యువ ఓపెనర్ పృథ్వీ షా తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే విషయంపై జట్టు మేనేజ్‌మెంట్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.
అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ఆతిథ్య జట్టుతో జరగనున్న తొలి టెస్టులో అతని స్థానంలో రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ, టెస్టుల్లో మాత్రం ఎప్పటి నుంచో మిడిలార్డర్‌లోనే ఆడుతున్నాడు.
ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్‌లో రోహిత్
ఈ ఏడాది ఆరంభంలో సఫారీ పర్యటనకు ఎంపికైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్, వెస్టిండిస్‌లతో ఆడిన టెస్టు సిరిస్‌లకు రోహిత్ శర్మను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్, వెస్టిండిస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ అద్భుత ప్రదర్శన చేయడంతో మరోసారి అతడికి ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు టెస్టు జట్టులో చోటు కల్పించారు.
వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డ పృథ్వీ షా
ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు జట్టులో పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో ఓపెనర్లను ఎంపిక చేశారు. దీంతో రోహిత్ శర్మ మళ్లీ మిడిలార్డర్‌లోనే ఆడతాడని అభిమానులంతా భావించారు. అయితే సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో పృథ్వీ షా గాయపడటంతో ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆసీస్ పర్యటన ఎంతో కీలకం
జట్టు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్లు సైతం సూచిస్తుండటంతో ఓపెనర్‌గా రోహిత్ శర్మను తీసుకోవడం టీమిండియాకు అన్ని విధాలా మంచిదేనని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. ఈ మేరకు మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.