IPL 2021: తొమ్మిది జట్లతో ఐపీఎల్-2021, మే-జూన్ మధ్యలో ఇండియాలో..
కరోనా సమయంలో అందరికీ తెగ ఆనందాన్ని పంచిన డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 అయిపోయిన నేపథ్యంలో బీసీసీఐ రానున్న ఐపీఎల్ 2021 (IPL 2021) మీద కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో ఈ సారి తొమ్మిది జట్లను ఆడించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. 2021 సీజన్‌కు (IPL 2021) ముందే మెగా వేలం నిర్వహించనున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. కరోనావైరస్ మహమ్మారి మరియు కోవిడ్ లాక్ డౌన్ తర్వాత ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి బిసిసిఐ (BCCI) కొత్త జట్టును చేర్చుకునే ఆలోచనలో ఉందని ది హిందూ రిపోర్టు నివేదించింది.
కాగా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అహ్మదాబాద్‌లో1,10,000 మంది వీక్షించే సామర్థ్యంతో స్టేడియంను పునరుద్ధరించిన నేపథ్యంలో అహ్మదాబాద్ నుండి ఈ కొత్త ఫ్రాంచైజ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ఎడిషన్ (IPL 2021 Players Auction) సెప్టెంబరు వరకు ఆలస్యం అయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన విషయం విదితమే. అయితే ఈ సారి మండు వేసవిలో ఇండియాలో జరుగుతుందని తెలుస్తోంది. ఐపిఎల్ యొక్క 2021 ఎడిషన్ భారతదేశంలో జరుగుతుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. బోర్డు దాని కోసం ప్రయత్నాలు చేస్తోందని కూడా తెలిపారు. మంగళవారం జరిగిన ఫైనల్‌లో ఢీల్లీని ఓడించి ముంబై ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకున్న సంగతి విదితమే.
ఇదిలా ఉంటే ఆటగాళ్లు భారత్ కి రాకముందే ఇండియా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇక జనవరి-ఫిబ్రవరిలో భారత్ ఇంగ్లాండ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. పూర్తి స్థాయి ఐపిఎల్ వేలం జరగాలంటే బిసిసిఐ ఈ ఏడాది డిసెంబర్ మూడవ వారంలోగా జరపాల్సి ఉంటుంది. ఐపిఎల్ వచ్చే ఏడాది మార్చి నుంచి మే మధ్య జరగనున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవలసి ఉంది. రాబోయే వారాల్లో దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అయితే, కొత్త ఫ్రాంచైజీని చేర్చడం ఇది మొదటిసారి కాదు. ఐపిఎల్‌ను 10-జట్ల టోర్నమెంట్‌గా మార్చడానికి బిసిసిఐ ఎల్లప్పుడూ ఆసక్తి కనబరుస్తుంది. స్వల్ప కాలానికి ఐపిఎల్‌కు కొత్త జట్లను పరిచయం చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను తరచుగా ఉపయోగించుకుంటుంది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణాల ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్లను రెండు సంవత్సరాల పాటు నిషేధించినప్పుడు, 2016 మరియు 2017 మధ్య రెండు సీజన్లలో ఐపిఎల్‌లో చేరిన రెండు జట్లు రైజింగ్ పూణే సూపర్‌జైయంట్ మరియు కొచ్చి టస్కర్స్ గా ఉన్నాయి.