98 పరుగుల వద్ద సచిన్‌ను ఔట్ చేయడం బాధించింది

Monday, May 18, 2020 03:19 PM Sports
98 పరుగుల వద్ద సచిన్‌ను ఔట్ చేయడం బాధించింది

2003 ప్రపంచకప్‌లో బారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 98 పరుగులకే ఔటవ్వడం బాధించిందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. సచిన్ సెంచరీ చేయాలని తాను కోరుకున్నట్లు ఆదివారం హలో యాప్‌ లైవ్‌సెషన్‌లో తెలిపాడు. 

అక్తర్ మాట్లాడుతూ "సచిన్ 98 పరుగులకు ఔటవ్వడం చాలా బాధేసింది. అది చాలా ప్రత్యేకమైన ఇన్నింగ్స్. అతను సెంచరీ చేయాల్సింది. నేను కూడా సచిన్ శతకం సాధించాలని కోరుకున్నా. నేను వేసిన బౌన్సర్ అంతకు ముందు అతను కొట్టిన సిక్సర్‌లా వెళ్తుందనుకున్నా" అని చెప్పాడు. 

ఆ మ్యాచ్‌లో 75 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో సచిన్ 98 పరుగులు చేసిన అక్తర్ బౌన్సర్‌కు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో అక్తర్ 10 ఓవర్లలో 72 పరుగులు సమర్పించుకొని ఒకే ఒక వికెట్ తీశాడు. అది కూడా సచిన్‌దే కావడం విశేషం. 


కోహ్లీ, సచిన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఓ అభిమాని అక్తర్ ప్రశ్నించగా "క్రికెట్‌లోనే అత్యంత కఠినమైన శకంలో మాస్టర్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి పరిస్థితుల్లో ఆడితే కనుక అతను సులువుగా మరో 1.30 లక్షల పరుగులు చేసేవాడు. కాబట్టి సచిన్-కోహ్లీ మధ్య పోలిక తేవడం సరైంది కాదు" అని చెప్పాడు. 


ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సచిన్ సూపర్ ఇన్నింగ్స్‌తో పాటు యువరాజ్(50 నాటౌట్), రాహుల్ ద్రవిడ్ (44 నాటౌట్) రాణించడంతో నాలుగు ఓవర్లు మిగిలుండగానే అద్భుత విజయాన్ని అందుకుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: