Fact Check: కేంద్రం ప్రతి వ్యక్తికి రూ.1,30,000 ఇస్తుందనే లింక్‌ను ఎవరూ క్లిక్ చేయకండి
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం విదితమే. గ్లోబల్ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోవిడ్ నియంత్రణ కోసం వరుసగా లాక్‌డౌన్ లు విధించడంతో జనజీవితం అస్తవ్యస్తమైపోయింది.లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఫేక్ వార్తలతో చాలామంది ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫేక్ వార్తలను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అలాంటి వార్తే ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ మెసేజ్ సారాంశం ఏంటంటే..
18 ఏళ్ల వయసు దాటిన ప్రతి పౌరుడికి కరోనా నిధుల కింద రూ.1,30,000 ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటన చేసిందనే వార్త తాజాగా వాట్సప్ లో వైరల్ అవుతోంది. ఈ డబ్బును అందుకోవాలంటే పూర్తి వివరాలు నమోదు చేయాలని పేర్కొంటూ, ఓ లింక్‌ను పంపుతున్నారు. అయితే, దాన్ని క్లిక్ చేయొద్దని, ఆ ప్రచారంలో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. పీఐబీ ఫాక్ట్-చెక్ బృందం ఈ మేరకు ట్విట్టర్లో ఈ ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని తెలిపింది.
కరోనా ఫండ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో కేటగాళ్లు అనేక రకాలుగా మోసాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని వీటిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఆర్థిక సాయం అందిస్తోందని వచ్చే మెసేజ్ లు నమ్మవద్దని కోరుతున్నారు.