OTT Platforms: ఆన్‌లైన్ ఛానల్స్‌ ప్రారంభించేవారికి షాక్, ఓటీటీ కంటెంట్‌ సంస్థలు ఇకపై సమాచార శాఖ పరిధిలోకి..

Wednesday, December 16, 2020 12:00 PM Technology
OTT Platforms: ఆన్‌లైన్ ఛానల్స్‌ ప్రారంభించేవారికి షాక్, ఓటీటీ కంటెంట్‌ సంస్థలు ఇకపై సమాచార శాఖ పరిధిలోకి..

New Delhi, November 11: ఓవర్ ది టాప్ (OTT)లో పెరిగిపోతున్న అశ్లీలం, పోర్న్ వీడియోలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ (Online News Portal ), అలాగే ఈ కంటెంట్‌ అందించే సంస్థలను సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి (I&B Ministry's Regulation) తీసువస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం సంతకం చేశారు. మొత్తం ఓటీటీ కంటెంట్‌లను (OTT Portals) సమాచార శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 

ఇకపై ఆన్‌లైన్ ఛానల్స్‌(Online Channels) మీద కేంద్రం నిఘా ఉండనుంది. కొత్తగా ఎవరైనా ఆన్‌లైన్‌ ఛానల్స్‌ ప్రారంభించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో యూట్యూబ్‌ ఛానల్స్‌, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తదితర స్ట్రీమింగ్‌ సర్వీసులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి.  

ప్రస్తుతం ప్రింట్‌ మీడియాను ప్రెస్‌ కౌన్సిల్‌ నియంత్రిస్తుండగా.. వార్తా ప్రసార చానళ్లను న్యూస్‌ బ్రాడ్ ‌క్యాస్టర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) మానిటర్‌ చేస్తోంది. సినిమాల విషయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్ ‌(సీబీఎఫ్‌సీ)కి నియంత్రణ చేస్తోంది. ఇక ప్రకటనలకు సంబంధించి అడ్వర్టయిజింగ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నియంత్రణ బాధ్యతలు చూస్తోంది. 

 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ నియంత్రణపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా గత నెలలో సుప్రీం కోర్టు (Supreme Court) కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను కోరిన సంగతి విదితమే. ఓటీటీ లేదా వివిధ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఫిల్ములు, సిరీస్‌ల తయారీదారులు సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు పొందకుండానే కంటెంట్‌ను విడుదల చేస్తున్నట్లు పిటిషన్‌లో ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ సంధర్భంగా స్వతంత్ర సంస్థ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించే అంశంపై కేంద్రం, సమాచార ప్రసార శాఖ, దేశీ ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్స్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. 
 
ఇదిలా ఉంటే  ఓటీటీ ఫ్లాట్ ఫాం.. సినిమా థియేటర్లు లేని లోటును తీరుస్తున్నాయి. వెబ్ సిరీస్‌లు మాత్రమేగాక కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో ఓటీటీలకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఓటీటీలో అశ్లీలతకు అడ్డూ అదుపూ లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి. సెన్సార్ కచ్చితంగా ఉండాలన్న డిమాండ్లు వస్తుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓటీటీ కంటెంట్‌పై నిఘాతో అశ్లీలతను కంట్రోల్ చేయనున్నారు.

For All Tech Queries Please Click Here..!