యూజర్ల దెబ్బకి వెనక్కి తగ్గిన వాట్సప్, అప్‌డేట్ మరో మూడు నెలల పాటు వాయిదా
వాట్సాప్ తాజాగా తీసుకువచ్చిన నూతన ప్రైవసీ విధానంపై వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్‌ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. కాగా పది రోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ( new privacy policy) నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్ మొబైల్ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ పని చేయదని ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్ (WhatsApp) యూజర్ వ్యక్తిగత సమాచారం, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ఫేస్‌బుక్‌తో (Facebook) పంచుకోనుంది. ఇక వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను డిలీట్ చేసి.. టెలిగ్రాం, సిగ్నల్ యాప్స్‌కి మారారు.
దీంతో వాట్సప్ అలర్ట్ అయింది. తన అప్‌డేట్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ తన బ్లాగ్‌లో ‘‘మీరు.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా మీ మధ్యే ఉంటుందనే ఐడియా మీద వాట్సాప్‌ని అభివృద్ధి చేశాం. మీ వ్యక్తిగత సంభాషణని ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ పద్దతిలో మేం రక్షిస్తాం. వాట్సాప్, ఫేస్‌బుక్ మీ సందేశాలను చదవదు.. మీరు పంపే లోకేషన్‌లని చూడదు.. మీరు ఎవరికి కాల్ చేశారు.. ఎవరితో మెసేజ్ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోం’’ అని తెలిపింది.
ఈ రోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ బిజినెస్‌తో షాపింగ్ చేయకపోయినా, భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని ఎంచుకుంటారని మేము భావిస్తున్నాము. ఈ సేవల గురించి ముఖ్యమైన వ్యక్తులకు తెలుసు. ఈ అప్‌డేట్ ఫేస్‌బుక్‌తో డాటాను పంచుకునే మా సామర్థ్యాన్ని పెంచదు’’ అని స్పష్టం చేసింది.
ఇక యూజర్లు కొత్త అప్‌డేట్‌ను అంగీకరించే తేదీని మేం వెనక్కి తీసుకుంటున్నాం. ఫిబ్రవరి 8 న ఎవరి అకౌంట్‌లను నిలిపివేయం.. తొలగించం. అలానే వాట్సాప్‌లో గోప్యత, భద్రత ఎలా పనిచేస్తుందనే దానిపై ఉన్న తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి మేము ఇంకా చాలా చేయబోతున్నాం. మే 15న కొత్త బిజినెస్ ఫీచర్ అందుబాటులోకి రాకముందే మేము పాలసీని సమీక్షించడానికి క్రమంగా ప్రజల వద్దకు వెళ్తామని తెలిపింది.