టియాగో కంటే తక్కువ ధరలో టాటా నుండి మరో కొత్త కారు

Automobiles Published On : Friday, March 22, 2019 03:20 PM

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ అతి త్వరలో ఎంట్రీ లెవల్ కార్ల మార్కెట్లోకి సరికొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. టాటా విడుదల చేయాలని భావిస్తున్న కొత్త హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం ఉన్న టాటా టియాగో క్రింది స్థానంలో నిలవనుంది. టాటా బేస్ మోడల్‌గా భావించే ఈ కారును మారుతి సుజుకి ఆల్టో హ్యాచ్‌బ్యాక్ కారుకు సరాసరి పోటీనిచ్చేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

టాటా మోటార్స్ ముఖ్య కార్యనిర్వహణా అధికారి మాట్లాడుతూ... దేశీయంగా టాటా టియాగో మరియు టిగోర్ మోడళ్ల కంటే క్రింది స్థానంలో ఉన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల శ్రేణిలో టాటా నుండి ఎలాంటి మోడల్ లేదు... అయితే ఈ విభాగంలో కూడా టాటా తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదికగా టాటా మోటార్స్ ఆవిష్కరించిన ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ సంస్థకు మంచి లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఫ్లాట్‌ఫామ్ క్రింద అభివృద్ది చేసిన మోడళ్లకు దేశవిదేశాల్లో విపరీతమైన ఆదరణ లభించింది. గత మూడేళ్ల కాలంలో టాటా విడుదల చేసిన టియాగో, టిగోర్, హెక్సా, నెక్సాన్, హ్యారీయర్ వంటి మోడళ్ల విపరీతమైన ప్రజాదరణ లభించింది. అత్యంత సరసమైన ధరలో కార్ ప్రియుల అభిరుచి మరియు సౌకర్యాలకు అనుగుణంగా కొత్త కార్లను రూపొందిస్తుండటంతో టాటా మోటార్స్ మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాకుండా అత్యంత కీలకమైన సెగ్మెంట్లో విదేశీ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది.