రూ. 5.29 లక్షలకే విడుదలైన టాటా ఆల్ట్రోజ్.. మారుతి ఖేల్ ఖతం!
దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) కారును విడుదల చేసింది. ఫస్ట్ టైమ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఒక కొత్త కారును టాటా తీసుకొచ్చింది. టాటా ఆల్ట్రోజ్ XE, XM, XT, XZ, XZ (O) అనే ఐదు విభిన్న వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది.
కార్ల సేఫ్టీ పరీక్షించే అంతర్జాతీయ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (GLOBAL NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో టాటా ఆల్ట్రోజ్ 5-స్టార్ రేటింగ్ సాధించి, భారతదేశపు అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. సేప్టీ పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఇబిడి, క్రూయిజ్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు ఇంకా ఎన్నో ఫీచర్లు వచ్చాయి.
టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రూ. 5.29 లక్షల నుండి రూ. 9.29 లక్షల ధరల శ్రేణి లభిస్తోంది, దీని మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టాటా ఆల్ట్రోజ్ విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు టయోటా గ్లాంజా కార్లకు గట్టి పోటీనిస్తుంది.