వడ్డీ రేట్లు భారీగా తగ్గించిన ఆర్బీఐ

Business Published On : Friday, February 7, 2025 11:57 AM

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సామాన్య, మధ్య తరగతి వారికి పన్ను మినహాయింపును పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును తగ్గించింది. ఇదివరకు రెపో రేటు 6.5 ఉండగా ఇప్పుడు ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అందువల్ల కొత్త రెపో రేటు 6.25గా ఉంది. రెపో రేటు తగ్గించడం ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్ కడుతున్న వారికి వడ్డీ భారం తగ్గనుంది. అలాగే నెలవారీ EMIలు చెల్లించేవారికి కూడా వడ్డీ భారం తగ్గనుంది.

ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ మానెటరీ పాలసీ కమిటీ (MPC).. రెపో రేటును తగ్గించింది. కొంతమందికి ఈ రెపో రేటు అంటే ఆర్బీఐ ఇతర బ్యాంకులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు దానిపై వేసే వడ్డీ రేటు. ఇప్పుడు దీన్ని ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది కాబట్టి బ్యాంకులకు తక్కువ వడ్డీకే రుణం వచ్చినట్లు అవుతుంది. అప్పుడు బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. అందువల్ల ఈ నిర్ణయం పేదలు, మధ్య తరగతి వారికి మేలు చెయ్యనుంది. చివరిసారిగా మే 2020లో ఆర్బీఐ ఇలా రెపో రేటును తగ్గించింది.