భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి ఇలా..

Crime Published On : Monday, January 27, 2025 08:13 AM

భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ చివరికి ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధార్వాడలో చోటు చేసుకుంది. ధార్వాడలో రామదుర్గకు చెందిన శ్వేత(24)కు మూడున్నరేళ్ల క్రితం రామదుర్గకు చెందిన విశ్వనాథ్‌తో పెళ్లి అయింది. ఇన్‌స్టాలో శ్వేతకు ధార్వాడ తాలూకా శివళ్లి గ్రామానికి చెందిన విజయ్‌ నాయకర్‌తో స్నేహం మొదలై ప్రేమగా మారింది.

భర్తను వదిలేసి ఆమె శ్రీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో సహజీవనం ప్రారంభించింది. శ్వేత కుటుంబ సభ్యులు విజయ్‌ ఇంటికి వెళ్లి ఇది సబబు కాదని మందలించారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని, తమ కుమార్తె సంసారాన్ని నాశనం చేయవద్దని బుద్ధిమాటలు చెప్పారు. విజయ్‌ తమనే బెదిరించినట్లు శ్వేత తల్లి శశి సావంత్‌ తెలిపారు. శ్వేత ఇటీవల భర్త విశ్వనాథ్‌కు విడాకుల నోటీసు కూడా పంపింది. 

శుక్రవారం విజయ్, శ్వేత మధ్య ఏం జరిగిందో ఏమో శ్వేత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థలాన్ని ఉప నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొన్నారు. సంసారంలో చిచ్చు పెట్టిన విజయ్‌ పరారీలో ఉన్నాడు.