పెళ్లికి ఒప్పుకోలేదని.. వెంటాడి గొంతు కోసి చంపేశాడు
పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్లో పట్టపగలే చోటు చేసుకుంది. నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సింధనూర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంఎస్సీ చదువుతున్న షిఫా, లింగసగురు నుంచి ప్రతీ రోజు కాలేజీకి వస్తూపోతూ ఉండేది. ఆమెకు 6 ఏళ్లుగా నిందితుడితో పరిచయం ఉంది. ఆ సమయంలో నిందితుడు ఆమె పట్ల ప్రేమను పెంచుకున్నాడు. అయితే, ఇటీవల షిఫాకు వేరే వ్యక్తితో వివాహం గురించి ఇంట్లో చర్చలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ముబిన్ తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. షిఫా దీనికి నిరాకరించింది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో నిందితుడు లింగసగురు నుంచి ఆమెను వెంబడించి సింధనూర్ ప్రభుత్వ గ్రాడ్యుయేట్ కాలేజీ సమీపంలో ఆమెపై దాడి చేశాడు. మెడపై కత్తితో పొడిచి, ఆపై గొంతు కోసం అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య చేసిన తర్వాత, షిఫాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి దుకాణానికి వెళ్లి గొడవపడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు లింగసగురు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.