కుక్కర్ మర్డర్ కేసు: మాధవిని ఒక్కడే చంపలేదు..
హైదరాబాద్ మీర్ పేట్ లో మలయాళం మూవీ సూక్షదర్శిని సినిమాలో లాగా భార్య మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసి కుక్కర్ లో ఉడికించి, పొడి చేసి చెరువులో పడేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఇదంతా ఒక్కడే చేశాడనే ఇప్పటిదాకా తెలుసు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఆయనకు కుటుంబసభ్యుల్లో ముగ్గురు సహకరించినట్లు తెలుస్తోంది. పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం మీర్‌పేట మర్డర్ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో గురుమూర్తిని ఏ-1గా పేర్కొన్న పోలీసులు, మరో ముగ్గురి పేర్లనూ చేర్చారు.
ఆ ముగ్గురూ పరారీలో ఉన్నట్లుగా తెలిసింది. ముగ్గురిలో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. అయితే హత్యలో గురుమూర్తికి కొందరు సహకరించారన్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా గురుమూర్తిని నాలుగు రోజుల విచారణ నిమిత్తం శనివారం మీర్‌పేట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హత్య కేసుకు సంబంధించి మిగతా నిందతుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసలు అన్వేషిస్తున్నారు. గురుమూర్తి విచారణ పూర్తయ్యేలోపు మిగతా నిందితులనూ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.