కన్న తండ్రే బిడ్డలను పంట కాలువలోకి తోసేశాడు.. ఆపై కనిపించకుండా పోయాడు..

Crime Published On : Wednesday, March 19, 2025 01:00 PM

కన్న తండ్రే తన బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు సమీపాన చోటు చేసుకుంది. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు గృహోపకరణాలను వాయిదాలపై అందించే వ్యాపారం చేస్తుండేవాడు. ఇతడికి ఒక వ్యక్తి రూ.30 లక్షలు బాకీ పడ్డాడు. మరోవైపు అప్పులు అధికంగా ఉండడంతో అందరం కలిసి చనిపోదామని భార్య విజయతో తరచూ చెప్పేవాడు.

ఈ నేపథ్యంలో బావమరిది సురేంద్ర కొంత ఆర్థిక సాయం చేశాడు. అయినా సరే చనిపోదామనే రాజు అంటూండేవాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి అప్పులు తీరుద్దామని విజయ చెబితే పరువు పోతుందని అనేవాడు. రాజు కుమారుడు రామసందీప్‌ (10), కారుణ్యశ్రీ (6) రామచంద్రపురంలోని భాష్యం స్కూలులో నాలుగు, ఒకటో తరగతులు చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లి పిల్లలను బైక్‌పై ఎక్కించుకున్న రాజు ఇంటికి కాకుండా, వెంటూరు నుంచి కాలువ గట్టు మీదుగా నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపాన ఉన్న పంట కాలువ వద్దకు తీసుకెళ్లాడు. గట్టుపై దాదాపు 350 మీటర్ల దూరం వెళ్లాక పిల్లలను హఠాత్తుగా కాలువలోకి తోసేశాడు.

సుడిలో చిక్కుకుని కారుణ్యశ్రీ గల్లంతవగా కాలువ గట్టున ఉన్న తుప్పలను పట్టుకుని వేలాడి సందీప్‌ ప్రాణాలు దక్కించుకున్నాడు. అతడు బయటకు వచ్చి అటుగా వెళ్తున్నవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు ద్రాక్షారామ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్‌ ఫైర్‌ సిబ్బందిని రప్పించి, గాలింపు చేపట్టగా సాయంత్రానికి కారుణ్యశ్రీ మృతదేహం లభ్యమైంది. తల్లి విజయ, అమ్మమ్మ, మావయ్య ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను కాలువలోకి తోసేసాకా రాజు బైక్‌పై పరారైనట్లు సమాచారం. అతడి ఆచూకీ లేకపోవడంతో భార్య విజయ, బంధువులు ఆందోళన చెందుతున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...