పెళ్లయిన వెంటనే.. కూతురు అల్లుడిని కత్తితో పొడిచిన తండ్రి

Crime Published On : Friday, March 7, 2025 11:00 AM

ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం చోటుచేసుకుంది. గుడుపల్లి మండలం అగరం కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, అదే గ్రామానికి చెందిన కౌసల్య ప్రేమించుకున్నారు. ఈ నెల 3న పెద్దల అంగీకారం లేకుండా తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా యాదగిరి హిల్స్‌పై ఉన్న ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం భవిష్యత్తులో గొడవలేం లేకుండా తమ వాళ్లతో మాట్లాడాల్సిందిగా ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించింది.

వారి ప్రేమపెళ్లి విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. గ్రామ పెద్దలు కౌసల్య, చంద్రశేఖర్‌తో పాటు కౌసల్య తండ్రి శివశంకర్‌ను కూడా పంచాయితీకి పిలిచారు. కుప్పంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో రాజీ చేసేందుకు ప్రయత్నించారు. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని శివశంకర్‌ పెద్దల సమక్షంలోనే కత్తితో కౌసల్య, చంద్రశేఖర్‌లపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఊహించని ఘటనతో అంతా షాక్‌కి గురయ్యారు. శివశంకర్‌ను ఆపే ప్రయత్నంలో చంద్రశేఖర్‌ మేనమామ రమేష్‌, పంచాయితీ పెద్దమనిషిగా వ్యవహరించిన సీతారామప్పపై కూడా ఆయన దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కౌసల్య, చంద్రశేఖర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...