ఆ సినిమాలో లాగా భార్య శవాన్ని మాయం చేయాలని చూశాడు.. చివరికి..
మాధవి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయట పడుతోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలోని టెక్నిక్స్ ఉపయోగించానని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమా ఇటీవల తెలుగులోనూ విడుదలైంది. అందులో ఒక మహిళను కొడుకుతో కలిసి తల్లి హత్య చేస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేయాలని తల్లీకొడుకు పథకం వేస్తారు. ఇంట్లో చిన్నపాటి నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేసి, అందులో యాసిడ్, ఇంకొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్, రసాయనాలు శవాన్ని కరిగించి నీళ్లలా మార్చేస్తాయి. శవం మొత్తం కరగడానికి ఐదారు రోజులు పడుతుంది. ఆ నీళ్లను కొంత కొంత చొప్పున కాలిపోకుండా వాష్‌రూమ్ నుంచి ఫ్లష్ ద్వారా మెల్లమెల్లగా వదులుతారు. కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా... తర్వాత పొడి చేసి ఫ్లష్ ద్వారానే డ్రైనేజీలోకి వదిలేస్తారు. ఆ తల్లీకొడుకు ప్రవర్తనపై అనుమానం వచ్చిన పక్కింటి అమ్మాయి (హీరోయిన్) స్వయంగా విచారణ చేసి వారి నేరాన్ని ఎలా బయటపెట్టి పోలీసులకు పట్టించిందనేది సూక్ష్మదర్శిని సినిమా.
వెంకట మాధవి హత్య కేసులోనూ నిందితుడు ఆమె శవాన్ని ఆ సినిమాలో చూపించినట్టే మాయం చేయాలని భావించాడు. హెక్సా బ్లెడుతో తల, మొండెం వేరు చేసి, శరీరాన్ని మూడు ముక్కలుగా కోసి, మాంసాన్ని బకెట్లో వేసి నీళ్లు పోసి హీటర్‌తో మరిగించి, ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్, ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న చిన్న ముద్దలయ్యేలా చేసినట్లు సమాచారం. ఎముకలను స్టవ్‌పై కాల్చి చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి, దంచి పొడిలా మార్చినట్లు తెలుస్తోంది. కొంత బాత్రూమ్లో ఫ్లష్ ద్వారా, మిగిలినది బకెట్లో వేసుకొని మీర్‌పేట పెద్ద చెరువులో పారేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
నిందితుడు గురుమూర్తి చేతికి కాలిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించగా శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో ఆ గాయాలైనట్లు అతను చెప్పినట్లు తెలిసింది. ఇంట్లోంచి బయటకు దుర్వాసన రాకుండా పలు రకాల రసాయనాలు, స్ర్పేలు వాడినట్లు సమాచారం. బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించగా అవి వెంకటమాధవికి చెందినవేనని నిర్ధారించారు.