తన ఫోటో డీపీ పెట్టుకున్నాడని ఆత్మహత్య చేసుకున్న భార్గవి
సిద్ధిపేట జిల్లా పెద్ద కోడూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని భార్గవి హైదరాబాద్లోని జామై ఉస్మానియా సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఆత్మహత్యకు ఒక యువకుడి వేధింపులే కారణమని తెలుస్తోంది. చంటి అనే యువకుడు తన ఫొటోను డీపీగా పెట్టుకోవడం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చంటి అనే యువకుడు భార్గవి ఫొటోను డీపీగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి భార్గవి తన ఫొటో ఎందుకు పెట్టుకున్నావంటూ వాట్సాప్లో మెసెస్ పంపింది. దానికి నువ్వంటే ఇష్టం అంటూ అందుకే పెట్టానంటూ చంటి రిప్లై ఇచ్చాడు. చంటితో చాటింగ్ చేసిన భార్గవి ఒకింత ఆవేశంగానే ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పిచ్చిపిచ్చి నాటకాలు చేయకు, నీవల్ల నాకు ఇబ్బంది అవుతుంది. మాఅన్న, అక్కవాళ్లు నీ డీపీ చూశారు. ఫోటో డిలెట్ చేయి, లేదంటే మా అన్నవాళ్లు నిన్ను కొడతారు. నా తప్పు లేకున్నా నన్ను తప్పుగా చూస్తారు. ఏమన్న ఉంటే అన్ని బంద్ చేసుకో, తన్నులు తింటా అంటే నీ ఇష్టం ఇగ అంటూ' చాట్ చేసింది. అయితే ఆ యువకుడు కూడా సారీ చెల్లె ఏదో గలత్తో పోటో పెట్టానని, ఇంకోసారి జరగదని, మీ అన్న వాళ్లకు చెప్పకు సారీ అంటూ చాట్ చేశాడు. అయితే అదే రాత్రి తన గ్రామానికి చెందిన తన బంధువులు, స్నేహితులు, కొంతమంది గ్రామస్తులకు ఫోన్ చేసి తన గురించి ఏమన్న తెలిసిందా అని ఎంక్వరీ చేసినట్లు తెలిసింది. అయితే తన ఫోటో డీపీ పెట్టుకోవడం వల్ల తన గురించి అందరూ చెడుగా అనుకుంటారనే మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.