ముగ్గురి ప్రాణం తీసిన జీరా సోడా
జీరా సోడా తాగి ముగ్గురు మృతి చెందిన దారుణ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ ఖేడా జిల్లా నదియాద్ నగరంలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు యోగేష్ కుష్వాహా (40), రవీంద్ర రాథోడ్ (50), కనుభాయ్ చౌహాన్ (59) అనుమానాస్పదంగా చనిపోయారు. అయితే వీరు ముగ్గురు జీరా సోడాతో సహా మద్యం సేవించినట్లు వారి స్నేహితులు తెలిపారు. ఈ కారణంగానే ఆరోగ్య పరిస్థితి విషమించడతో స్నేహితులు నాడియాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి అడ్మిట్ అయిన కాపేపటికే చనిపోయారని పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి జీరా సోడా బాటిల్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. విచారణలో మాత్రం మృతుల్లో ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్, మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు రక్త నమూనా పరీక్షల్లో తేలింది. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఘటనపై మరింత స్పష్టత రానుందని పోలీసులు చెప్పారు. 2022లో అహ్మదాబాద్, బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 42 మంది కన్నుమూశారు. 2023 డిసెంబర్ లోనూ గుజరాత్ లో ఇలాగే మిథైల్ ఆల్కహాల్ కలిగిన ఆయుర్వేద సిరప్ తాగి ఐదుగురు చనిపోయారు.